– చెదురుమదురు ఘటనలే తప్ప చెప్పుకోదగ్గ నిరసనలేం లేవు
– అసంతృప్తి చల్లార్చిన కాంగ్రెస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్ గప్‌చుప్‌గా ఉన్నది. చెదురుమదురు ఘటనలు మినహా గాంధీభవన్ శనివారం ప్రశాంతంగా ఉన్నది. అభ్యర్థుల ప్రకటన తర్వాత జరగనున్న పరిణామాలను పార్టీ ముందుగానే గ్రహించి అసంతృప్తిని చల్లార్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తొలి జాబితా కంటే రెండో జాబితా తర్వాత నిరసనలతో గాంధీభవన్ దద్దరిల్లుతుందని అందరూ భావించారు. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలను ఆశించి భంగపడిన గొట్టిముక్కుల వెంగళ్‌రావు, పి విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు మాత్రం గాంధీభవన్ వద్ద నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లెక్సీలు చించేయడం, ఇటుకలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారితో పార్టీ నేతలు మాట్లాడిన తర్వాత శాంతించారు. గతం కంటే ఈసారి అసంతృప్తుల విషయంలో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే గాంధీభవన్ వైపు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. గతంలో టికెట్లు దక్కని నేతలు దశలవారీగా వచ్చి రకరకాల పద్దతుల్లో నిరసనలు తెలిపిన సందర్భాలున్నాయి.
కొంత మంది పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పక్కా వ్యూహ్యాన్ని అనుసరించడంతో పాత సంప్రదాయాలకు తెరపడిందని పార్టీ నేతలు చెబుతున్నారు. కారు ఢ కొనే క్రమంలో గెలుపుగుర్రాలకు టికెట్లు కేటాయించిందనే వాదన వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో టికెట్లు దక్కని నేతలు సహజంగానే కొంత అసంతృప్తికి గురి అవుతారనేది తెలిసిందే. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో చాలా కాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ…సొంత డబ్బు ఖర్చు చేసుకుని ఉంటారు. కొంత మందికి ప్రజల్లో పలుకుబడి కూడా ఉండవచ్చు. అటువంటి కీలక నేతలను టికెట్ దక్కించుకున్న అభ్యర్థి.. నేరుగా వారితో మాట్లాడుకోవాలని పార్టీ సూచించినట్టు తెలిసింది. అరమరికలు లేకుండా అన్ని విషయాలు వారితో చర్చించి, వ్యతిరేకత రాకుండా అభ్యర్థులే చూసుకోవాలని రేవంత్‌రెడ్డి ఓ మెలిక పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ రాలేదంటూ గాంధీభవన్‌కు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. అభ్యర్ధులకు సహకరించేలా మీరే చొరవ తీసుకుంటే, కొంతమేరకు ఉపశమనం కలుగుతుందని పార్టీ అంచనా వేసింది. దీని ప్రకారం టికెట్ దక్కని చాలా మంది నేతలు ఆయా జిల్లాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ పడమర టికెట్ ఆశించిన జంగా రాఘవరెడ్డి టికెట్ దక్కకపోవడంతో రగిలిపోయారు.అక్కడ కొంత హల్‌చల్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకరిద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం చైర్మెన్ సోహెల్ పార్టీకి రాజీనామా చేశారు. 40 ఏండ్లుగా పార్టీ కోసం పని చేసినా తనకు టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఆశించి భంగపడిన నేతల్లో మచ్చుకు ఎర్రశేఖర్, సుభాష్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, వెంకట్, ప్రవీణ్‌రెడ్డి, బలరాంనాయక్, బెల్లయ్యనాయక్, తిరుపతిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీరంగం సత్యం, శ్రీకాంత్, రోహిత్, పారిజాత నర్సింహారెడ్డి, రమేష్‌నాయక్, ఈ వెంకట్రామ్‌రెడ్డి, రఘునాథ్‌యాదవ్, దండెం రామిరెడ్డి, చలమల కృష్ణారెడ్డి, సర్వే సత్యనారాయణ, పిడమర్తి రవి తదితరులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో కొంత మంది నేతలతో రేవంత్‌రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ సీనియర్ నేత కె జానారెడ్డి కూడా రంగంలోకి దిగినట్టు తెలిసింది. మొత్తంగా మూడో జాబితా వచ్చేవరకు అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 100 సీట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ…19 స్థానాలు ప్రకటించాల్సి వస్తుంది. అందులో సీపీఐ, సీపీఐ(ఎం), టీజేఎస్ పార్టీలకు సీట్ల కేటాయింపులుంటాయి. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆయా స్థానాలను ఆశిస్తున్న నేతలను పార్టీ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
మహిళా కాంగ్రెస్ మినహా ఏ విభాగానికి టికెట్ దక్కలే…
పార్టీ అనుబంధ విభాగాలకు టికెట్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందనే చర్చ మొదలైంది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీతారావుకు మాత్రమే గోషామహల్ టికెట్ దక్కింది. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గౌడ్, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐ, సేవాదళ్ విభాగాల చైర్మెన్లకు టికెట్ దక్కలేదు. ఆయా విభాగాలకు చెందిన చైర్మెన్లు అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు చేసుకున్నారు.