గాంధేయ మార్గం అందరికీ ఆదర్శం

– జయంతి వేడుకల్లో కలెక్టర్, మేయర్

నవతెలంగాణ- కంటేశ్వర్
గాంధేయ మార్గం అందరికి ఆదర్శం,అనుసరణీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్ లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇరువురు జాతి నేతలు దేశానికి అందించిన సేవల గురించి కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సంగ్రామంలో అహింసా మార్గాన్ని ఎంచుకుని, అలుపెరుగని పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ అని శ్లాఘించారు. అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాల వారిని ఏకతాటిపైకి చేర్చి అహింసా పద్ధతిలోనే ఆంగ్లేయులతో పోరాడారని గుర్తు చేశారు. మహాత్ముడు చూపిన అహింసా మార్గం అన్ని కాలాలకు, అన్ని తరాల వారికి ఆదర్శం, అనుసరణీయమని అన్నారు. మహాత్ముడి జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకుని స్ఫూర్తి పొందాలని, జాతిపిత చూపిన బాటలో పయనిస్తూ దేశాభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అందుకే ప్రభుత్వం మహనీయుల జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ.. అహింసా, సత్యాగ్రహంను ఆయుధంగా మల్చుకుని భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆదర్శనీయులు మహాత్మా గాంధీ అని అన్నారు. అహింసా మార్గంలోనే సుదీర్ఘ పోరాటం చేసి ఆంగ్లేయులను పారద్రోలి దేశానికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు సాధించి పెట్టారని కొనియాడారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచారణాత్మకంగా అమలు చేస్తూనే, ఇతరులకు వాటిని సూచించడం వల్లనే అవి ప్రపంచ వ్యాప్తంగా ఆచారణాత్మకం అయ్యాయని అన్నారు. మహాత్ముడి ఆశయాలు భావితరాలకు తెలియజేస్తూ వారిలో స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.