– గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
– డీజేలకు అనుమతి లేదు
– కొత్తూరులో యువకులకు గణేష్ ఉత్సవాలపై అవగాహనా సదస్సు
– శంషాబాద్ ఏసీపీ రామచందర్ రావు
నవతెలంగాణ-కొత్తూరు
గణేష్ ఉత్సవాలు ఐకమత్యానికి చిహ్నమని శంషాబాద్ ఏసీపీ రామచంద్రరావు అన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా గురువారం కొత్తూరు సీఐ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిర్వాణ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవా సమితి సభ్యులు తమ మండపాల వివరాలు, నిమజ్జన తేదీ మండపాల బాధ్యుల వివరాలను విధిగా ప్రతి ఒక్కరూ పోలీస్ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని అన్నారు. మండపాల బాధ్యులు పోలీసు వారికి సహకరించి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహ ఏర్పాటులో స్థల వివాదాలు లేకుండా చూసుకోవాలని అన్నారు. నాణ్యమైన విద్యుత్ తీగలను ఉపయోగించాలని, విద్యుత్ అధికారుల సూచనలు సలహాలు పాటించి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని పేర్కొన్నారు. నిమజ్జన సమయంలో చెరువుల వద్ద పూర్తిస్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. మండపాల వద్ద సినిమా పాటలు కాకుండా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని, ఒగ్గు కథ, బుర్ర కథలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి గణేష్ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఎల్లప్పుడు ఎవరైనా ఒక్కరు అక్కడ ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావివ్వకుండా అన్ని కులమతాలతో సహకరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు జి శ్రీనివాస్, కే శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు.