18 నుంచి గణేశ్‌ ఉత్సవాలు

From 18 Ganesh Festivals– శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు
– ట్రై పోలీస్‌ కమిషనరేట్ల సీపీల భేటీ
– జీహెచ్‌ఎంసీ,వాటర్‌బోర్డు, ఆర్టీసీ, అగ్నిమాపక, విద్యుత్‌, హెచ్‌ఎండీఏ అధికారుల హాజరు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో ట్రై పోలీస్‌ కమిషనరేట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు దృష్టి సారించారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. దాదాపు 15వేలకుపైగా చిన్నా పెద్దా గణేష్‌ విగ్రహాలను ఈసారి ప్రతిష్టాపన చేసే అవకాశముందని పోలీస్‌ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గణేశ్‌ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం(సీసీసీ)లో నగర సీపీ సీవీ ఆనంద్‌ అధ్యక్షతన కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రా, నగర అదనపు సీపీ, ట్రాఫిక్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పాల్గొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు. గణేష్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉత్సవాలపై గత అనుభవాలను వెల్లడించారు. పలు అభిప్రాయాలు, సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడారు. గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఉత్సావాలపై కోర్టు ఆదేశాలను పాటించాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేశ్‌ నిమజ్జనం జరిగే చెరువు, కట్టల వద్ద టెంట్లు, విద్యుత్‌ లైట్లు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని, మంచి నీటి సౌకర్యం, మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహాల ప్రతిష్టాపన వివరాలు, ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, మండపాల వద్ద సభ్యులు ఎంతమంది ఉంటారు, ఎలాంటి వాహనాలను ఉపయోగిస్తున్నా రు అనే తదితర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ట్రై పోలీస్‌ కమిషనర్లు అభిప్రాయపడ్డారు. గణేశ్‌ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ సూచించారు. విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, సీఐ స్థాయి అధికారి ముందుగానే సమావేశమై సమీక్షించాలన్నారు. గణేశ్‌ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కషి చేయాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ప్రత్యేక భద్రతతోపాటు అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల మరమ్మతుల తోపాటు రహదారులకు అడ్డుగావున్న చెట్ల కొమ్మలను తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. బేబీ పాండ్‌లు, చెరువుల పూడికతీత తదితర చర్యలు వెంటనే చేపడ్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. క్రేయిన్లు, మొబైల్‌ టాయిలెట్ల సౌకర్యాలు, నిరంతర విద్యుత్‌పై బస్సు సౌకర్యం, ఇతర అంశాలపై ఆయా శాఖల అధికారులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసీపీలతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోజ్‌, భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు, ఖైరతాబాద్‌ గణేష్‌ సమితి ప్రతినిధులు, విద్యుత్‌శాఖ, అగ్నిమాపక, ఆర్టీ, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండీఏ, నీటిపారుదల, మెట్రో అధికారులు పాల్గొన్నారు.