సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సెల్‌, ల్యాప్‌టాప్‌ దొంగల ముఠా అరెస్టు

– రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం : రైల్వే ఎస్పీ షేక్‌ సలీమా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనపర్చుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ షేక్‌ సలీమా శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక టీమ్‌ పోలీసులు శనివారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం నెంబర్‌.1లో నిలుచున్న రైలులో అనుమానాస్పద స్థితిలో ప్రయాణిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా.. తరచుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను, ఇతర విలువైన వస్తువులను కాజేసే దొంగల ముఠాగా తేలింది. దీంతో చైతన్య, రిజ్వాన్‌, పాటిల్‌, బాలు, మాణిక్యం, రాజు అనే ఈ ఆరుగురు దొంగల ముఠాను అరెస్ట్‌ చేశారు. వీరి దగ్గరి నుంచి 67 సెల్‌ఫోన్లు, ఒక విలువైన ల్యాప్‌టాప్‌తో పాటు రూ.10 వేల నగదును స్వాధీనపర్చుకున్నారు. నెమ్మదిగా కదులుతున్న రైలులో ఫుట్‌పాత్‌పై నిలబడి సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నవారిని దాడి చేసి, వారు కింద పడిపోగానే సెల్‌ఫోన్లు లాక్కొని పారిపోవటం ఈ దొంగల ముఠా నేర విధానమని ఎస్పీ సలీమా తెలిపారు.
అలాగే, సికింద్రాబాద్‌ రైళ్లలో కొద్ది దూరం ప్రయాణిస్తు అమాయకంగా కనిపించే ప్రయాణికుల నుంచి కూడా వీరు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను లాక్కొవటం, ఎత్తుకుపోవటం ఈ ముఠా మరొక నేర విధానమని ఆమె వివరించారు. మొత్తమ్మీద, గతేడాది కాలంగా ఈ ముఠా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను కేంద్రంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నదని తెలిపారు. ఇలాంటి ముఠాల పట్ల ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలనీ, ఫుట్‌పాత్‌లపై నిల్చొని సెల్‌ఫోన్లను మాట్లాడవద్దని ఆమె ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ దొంగల ముఠా మహారాష్ట్రకు చెందినవారు.