అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

– రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లే టార్గెట్‌
– వివరాలు వెల్లడించిన ఎస్పీ అపూర్వరావు
నవతెలంగాణ-నల్లగొండ
రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లే టార్గెట్‌ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ కే.అపూర్వరావు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వీరి వద్ద నుండి 51తులాల 9 గ్రాముల బంగారం, 34 తులాల వెండి, మూడు ద్విచక్ర వాహనాలు, 2 సెల్‌ ఫోన్లు,1 టాబ్‌ స్వాధీనపరుచుకున్నట్టు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో వరస దొంగతనాలు జరుగుతున్నా క్రమంలో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి నిందితుల గురించి గాలించినట్టు తెలిపారు. ఈనెల 15 న ఉదయం 6 గంటలకు పానగల్‌ బై పాస్‌ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు నల్లగొండ 2 టౌన్‌ సీఐ పీఎన్‌డీ. ప్రసాద్‌, సిసిఎస్‌ సీఐ జితేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సిసిఎస్‌ ఎస్‌ఐ మహేందర్‌, నల్లగొండ టూ టౌన్‌ ఎస్‌ఐలు రాజశేకర్‌రెడ్డి, సైదులు, పోలీస్‌ సిబ్బంది, సిసిఎస్‌ సిబ్బంది విష్ణువర్దన్‌ గిరి, రామ్‌ ప్రసాద్‌, మోహిన్‌ పాషా, కలిసి నిందితుణ్ణి పట్టుకొని విచారించారు. కనగల్‌ మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన రుద్రాక్ష శ్రీను, చెడు వ్యసనలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇతని పై గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 50 కి పై కేసులలో నిందితుడుగా ఉన్నాడు. ఇతని పైన హైద్రాబాద్‌ కుల్సుంపుర పోలీసు స్టేషన్‌ నుండి పీడీ యాక్ట్‌లో జైలుకి వెళ్ళి వచ్చినా తన ప్రవర్తనలో మార్చుకోకుండా నల్లగొండ పట్టణంలో 2 టౌన్‌ 1 టౌన్‌, భువనగిరి, చౌటుప్పల్‌, ఇబ్రహింపట్నం, మహబూబ్‌ నగర్‌, కడప, తదితర ప్రాంతాలలో రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సుమారు 18 కి పైగా కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఇతనితో పాటు బాస్కర్‌రెడ్డి, అరుణ్‌లు కలిసి దొంగతనాలు చేసేవారు. ప్రధాన నిందితుడు శ్రీను ఇచ్చిన సమాచారం మేరకు భాస్కర్‌ రెడ్డి, అరుణ్‌ల గురించి ప్రత్యేక బందాలుగా ఏర్పడి వెతుకుతుండగా ఈ నెల 20న నమ్మదగిన సమాచారం మేరకు నల్లగొండ బస్‌ స్టాండ్‌ వద్ద పట్టుకున్నట్టు విచారించారు. నిందితుల నుండి దొంగ సొత్తు కొన్న నలుగురు పైన కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిసిఎస్‌ డీఎస్పీ, నల్గొండ డీఎస్పీ నరసింహరెడ్డి పర్యవేక్షణలో నల్లగొండ 2 టౌన్‌ సిఐ పీఎన్‌డీ.ప్రసాద్‌, సిసిఎస్‌ సిఐ జితేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సిసిఎస్‌ ఎస్‌ఐ మహేందర్‌, నల్గొండ టూ టౌన్‌ ఎస్‌ఐ లు రాజశేకర్‌ రెడ్డి,సైదులు, సిబ్బంది ఎండి.షంషుద్దీన్‌ ,శంకర్‌ ,బాలకోటి, సిసిఎస్‌ సిబ్బంది విష్ణువర్దన్‌ గిరి, రామ్‌ ప్రసాద్‌, మోహిన్‌ పాషాలను ఎస్పీ అభినందించారు.