– 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం
– రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో నిందుతులపై 17 కేసులు
నవతెలంగాణ – సిరిసిల్ల
కష్టపడి పనిచేసుకోవడం ఇష్టం లేక జల్సాలకు అలవాటు పడి, ఈజీ మనీ కి అలవాటు పడి, దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడడాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు పట్టుకోగా సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్పి అఖిల్ మహాజన్ పాల్గొని మాట్లాడుతూ.. వేములవాడ రూరల్ మండలం ఫాసుల్ నగర్ లో ఉంటున్న హుస్నాబాద్ కి చెందిన శివరాత్రి సంపత్ అనే వ్యక్తి బావుల పూడిక, మట్టి పని చేసుకుని జీవిస్తాడు. ఎలాగైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకుని ఈ ఏడాది మే మాసంలో ముస్తాబద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గల పెద్దమ్మ గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తెలు, వెండి మట్టెలు దొంగిలించాడు. అలాగే ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో గల గొర్ల షెడ్డు నుండి రెండు గొర్లను దొంగిలించారు. సంపత్ తో గతంలో పని చేసిన అగ్రహారంకు చెందిన అల్లేపు పరుశురాం సిరిసిల్ల లో పరిచయం కాగా, సంపత్ పరుశురాంతో దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుదామని చెప్పాడు. అందుకు పరశురాం ఒప్పుకోగా ఇద్దరు కలిసి దేవాలయాల్లో దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్నారు.
చందుర్తి డ్యామ్ వద్ద గల దుర్గమ్మ ఆలయం, హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో బైక్, కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయం, బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లిలో గల పెద్దమ్మ ఆలయం, వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని పెద్దమ్మ ఆలయం, టెక్స్టైల్ పార్కులోని పెద్దమ్మ ఆలయం,ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం, బోయిన్పల్లి మండలం మల్లాపూర్ వద్ద సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం,వేములవాడ చెక్కపల్లిలోని పెద్దమ్మ ఆలయం, కరీంనగర్ రోడ్ లో గల ఓద్యారం గుట్టపై గల రామాలయం, అల్గునూర్ లోని ఎల్లమ్మ ఆలయం,వట్టెంల గ్రామంలో గల ఎల్లమ్మ ఆలయం, నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్ సిబ్బంది తో స్పెషల్ టీమ్ ఏర్పటు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం పొత్తూరు బ్రిడ్జి వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ఉపయోగించిన ఇనుప రాడ్, బైక్, మొబైల్ ఫోన్స్, 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందుతులను రిమాండ్ కి తరలించామని ఎస్పీ తెలిపారు. నిందుతులపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 కేసులు, జగిత్యాల జిల్లాలో 02 కేసులు, కరీంనగర్ లో 02 కేసులు, సిద్దిపేట జిల్లాలో 01 కేసులు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. వివిధ జిల్లాలో దేవాలయాల్లో వరుస దొంగతలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ మధు,చంద్రశేఖర్ లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.