బాలికపై సామూహిక లైంగిక దాడి

– ఆలస్యంగా వెలుగులోకి..
– వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలో ఘటన
నవతెలంగాణ-దోమ
బాలికపై ఐదుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడిన ఘటన వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికకు కొన్ని నెలల నుంచి అదే గ్రామానికి చెందిన ఓ బాలుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ చనువుగా మెలిగారు. అదే అదును చూసుకుని గత నెల 28న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం బాలికకు మాయమాటలు చెప్పి ఆ వ్యక్తి తన ఇంటిలోకి తీసుకువెళ్లాడు. అప్పటికే ప్రీ ప్లాన్‌తో ఉన్న ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంటికి వచ్చిన బాలికను.. ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు మందలించడంతో జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, బాలికకు పరీక్షలు నిర్వహించగా.. 12 వారాల గర్భం దాల్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ప్రస్తుతం నిందితులు డీఎస్పీ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. గంజాయి మత్తులో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులపై పోక్సో చట్టంతో పాటు 96, 172, 127, 76, 351 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు దోమ ఎస్‌ఐ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.