గంగారం బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని గంగారం గ్రామంలో వచ్చే నెల జూన్ 12వ తారీకు నుంచి ప్రారంభమయ్యే బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ హాజరై విజయవంతం చేయాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మోహన్ రావు అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ 12 సోమవారం 9 గంటల నుండి యాగశాల అలంకరణ, సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 13 మంగళవారం ఉదయం7.00 గంటల నుండి నిత్య అనుష్టానములు, నిత్య పూజలు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 14 బుధవారం నాడు ఉదయం 5.00 గంటలకు ఊరు ‘బలి’ కార్యక్రమం, ప్రతిష్టపనకు సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా కనుల పండుగ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గంగారం గ్రామంలోని మేధావులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామంలోని ప్రతి ఒక్కరు, గ్రామం నుండి బతుకుదెరువు కోసం, విధి నిర్వహణలో వేరే గ్రామాల్లో, పట్టణాలలో ఉన్న వారు కూడా వచ్చి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలతో గ్రామంలో ఐక్యమత్యం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షులు మల్లెల నాగేశ్వరరావు, సీఎంమాజీ ఎంపీపీ శ్రీదేవి నరేష్, సర్పంచ్ నాగేశ్వరరావు,బెల్లంకొండ రోశయ్య, గడ్డం వెంకన్న, గౌరబోయిన రాజబాబు, బొచ్చు మోహన్ రావు, బ్లాగు శ్రీనివాస్, బాలయ్య, సత్యం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.