తెలంగాణ సాహిత్య సభలలో ఘనపురం దేవేందర్ కు సత్కారం

నవతెలంగాణ- కంటేశ్వర్
భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభలలో జిల్లాకు చెందిన కవి, రచయిత ఉపాధ్యాయుడు పరిశోధకులు, వ్యాఖ్యాత ఘనపురం దేవేందర్ కు శాసన మండలి సభ్యులు, భారత జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. సభల నిర్వహణలో తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ రేడియో రూపకం అనే అంశంపై పత్ర సమర్పణ చేసిన ఘనపురం దేవేందర్ ను శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు బహుమతితో సత్కరించారు. నిజామాబాద్ వేదిక ద్వారానే కాకుండా రాష్ట్రస్థాయిలోనూ ఘనపురం దేవేందర్ గొప్పగా రాణిస్తున్నాడని శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ అభినందించారు. ప్రముఖ సాహితీవేత్త కుర్రా జితేందర్ బాబు, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రసిద్ధ రచయిత్రి అనిశెట్టి రజిత, భారత్ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి, తంగేడు పత్రిక సహసంపాదకులు కాంచనపల్లి తదితరులు ఘనపురం దేవేందర్ ను అభినందించారు. ఈ తెలంగాణ సాహిత్య సభలు హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆచార్య రవ్వా శ్రీహరి ప్రాంగణంలో, ఆచార్య బాల శ్రీనివాసమూర్తి వేదికన జూన్ 21 22 తేదీలలో ఘనంగా జరిగాయి అని తెలియజేశారు.