గొంతులో గరగర

Gargle in the throat– స్వర తంత్రులు దెబ్బతింటున్నాయి
– నిరంతర ప్రచారంతో ఇబ్బంది పడుతున్న నేతలు
న్యూఢిల్లీ : దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల వేడే కన్పిస్తోంది. రాజకీయ నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. విశ్రాంతి అనేదే లేకుండా ఊరూ వాడా చుట్టేస్తున్నారు. ర్యాలీలు, సభలు, ఆత్మీయ సమావేశాలు…ఒకటేమిటి అవకాశం దొరికితే చాలు. మైకు పట్టుకొని ప్రసంగాలు దంచేస్తున్నారు. అయితే అలుపెరుగని ప్రచారంతో నేతలు, అభ్యర్థుల గొంతుకలు గరగరమంటున్నాయి. స్వర తంతువులు (ఓకల్‌ కార్డ్స్‌) దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో స్వర తంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వాయిస్‌ సర్జన్లు అభిప్రాయపడుతున్నారు.
రేపు (మంగళవారం) వరల్డ్‌ వాయిస్‌ డే. వోకల్‌ కార్డ్స్‌ పాత్రను చాటిచెప్పడం, ప్రజలను జాగృతం చేయడం దీని ఉద్దేశం. రాజకీయ నాయకులు తమ గళాన్ని ఎంతో పొదుపుగా వాడుకోవాలని వాయిస్‌ సర్జన్లు సూచించారు. ఓకల్‌ కార్డ్స్‌ సమస్యలతో పలువురు నేతలు తనను కలుస్తుంటారని వాయిస్‌ సర్జన్‌ డాక్టర్‌ నుపుర్‌ నేరుర్కర్‌ చెప్పారు. ‘సంవత్సరం పొడవునా రాజకీయ నాయకులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది దురదృష్టకరం. లక్షణాలు కన్పించిన మూడు నుండి ఆరు నెలల తర్వాతే చాలా మంది నాయకులు నా వద్దకు వచ్చి సంప్రదిస్తుంటారు’ అని ఆయన తెలిపారు. రాజకీయ నేతలే కాదు… గాయ కులు, ఉపాధ్యాయులు, ఆర్‌జేలు, నటీనటులు, బిల్డర్లు, గృహిణులు, కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించా రు. రాజకీయ నాయకులు బిగ్గరగా, నిరంతరం మాట్లాడడమే కాదు…వారి ప్రసంగాలు తరచూ భావోద్వేగాలతో కూడి ఉంటాయి. ఒక్కోసారి వారు మైక్రోఫోన్‌ లేకుండానే చిన్న చిన్న సమూహాలను, పార్టీ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించాల్సి వస్తుంది. దీనివల్ల వారి గొంతు మరింత ఒత్తిడికి లోనవుతోంది.