నవతెలంగాణ-పెద్దవంగర: అభయహస్తం దరఖాస్తుల్లో వచ్చిన గ్యాస్ కనెక్షన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే ను ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అభయహస్తం పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల్లోని వివరాలన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్ వేర్‌లో ఇప్పటికే రూపొందించారని తెలిపారు. ఆ డాటా బేస్‌ను మొబైల్ యాప్‌కు అనుసంధానం చేసి, అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారని చెప్పారు. క్షేత్ర పరిశీలన లో అభయహస్తం దరఖాస్తుల్లో ఇచ్చిన వివరాలకు అనుగుణంగా ఏ ఏజెన్సీలో వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నదో మొబైల్ యాప్‌లో ఉండే వివరాలను ఫిజికల్‌గా ప్రజల నుంచి కూడా వివరాలు సేకరించి, క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. మొబైల్ యాప్‌లో ఉన్న వివరాలతో ఫిజికల్‌గా ప్రజలు చూపించే పత్రాల్లో ఉండే గ్యాస్ ఏజెన్సీ కోడ్, లబ్ధిదారుని పేరు ట్యాలీ అవుతున్నాయో లేదో చూసుకుని, అధికారులు నిర్ధారించాలన్నారు. కాగా మండలంలో మొత్తం 9523 ప్రజాపాలన దరఖాస్తులు రాగా వాటిలో గ్యాస్ కనెక్షన్ వివరాలు సరిగా లేని వాటిని 3180 అప్లికేషన్లు గుర్తించామని, ఈ రోజు వరకు 579 అప్లికేషన్లకు సంబంధించి సరైన గ్యాస్ కనెక్షన్ నెంబర్ సేకరించి అప్డేట్ చేశామని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.