రూ.500 లకే నేరుగా లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్ అందించాలి

– ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్, అక్కల బాపు
నవతెలంగాణ – మల్హర్ రావు
రూ.500 లకే లబ్ధిదారులకు నేరుగా గ్యాస్ సిలిండర్ అందజేయాలని ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్,అక్కల బాపు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలెండర్ నేరుగా రూ.500 రూపాయలకు లబ్ధిదారులకు అందించాలని, ముందు మొత్తం పైసలు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకుంటే ఆ తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పైసలు జమ చేస్తాము అనే విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. బ్యాంకులకు వెళ్లి పైసలు తీసుకోవాలన్నా పట్టణాలకు, మండల కేంద్రాలకు వెళ్ళక తప్పదన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ప్రయాణాల ఖర్చులకే అయిపోతాయని, తీసుకోవటం ఇవ్వడం కాకుండా మొదటనే రూ.500 రూపాయలు తీసుకొని గ్యాస్ సిలెండర్ ఇస్తే ఏ గందరగోళం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ పైసలు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని చెప్పి రెండు మూడు నెలలు జమ చేసి ఆ తరువాత జమ చేయలేదని గుర్తు చేశారు. మొత్తం పైసలు ముందు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకోవాలన్న పేదలకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేరుగా లబ్ధిదారులకు రూ.500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకుడు శ్రీనివాస్  పాల్గొన్నారు.