చీఫ్‌ కోచ్‌గా గౌతం గంభీర్‌?

gautam gambhir– నైట్‌రైడర్స్‌ మెంటార్‌ను సంప్రదించిన బీసీసీఐ
– మళ్లీ దరఖాస్తు చేసేందుకు ద్రవిడ్‌ నిరాసక్తి
భారత క్రికెట్‌ సీనియర్‌ మెన్స్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పదవి రేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టిఫెన్‌ ఫ్లెమింగ్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ సహా జస్టిన్‌ లాంగర్‌, ఆశీష్‌ నెహ్రాల పేర్లు ఇప్పటివరకు వినిపించాయి. గ్యారీ కిర్‌స్టన్‌ తర్వాత టీమ్‌ ఇండియాకు మళ్లీ విదేశీ కోచ్‌ ఖాయమే అనే అంచనాలు ఉన్నాయి. కానీ చీఫ్‌ కోచ్‌ రేసులోకి గౌతం గంభీర్‌ రాకతో సమీకరణాలు మారిపోయాయి. బీసీసీఐ పెద్దలే స్వయంగా గంభీర్‌ను సంప్రదించినట్టు సమాచారం. గంభీర్‌ సముఖత వ్యక్తం చేస్తే భారత జట్టు చీఫ్‌ కోచ్‌గా ఎంపిక కావటం లాంఛనమే!. భారత కొత్త చీఫ్‌ కోచ్‌ మూడున్నర సంవత్సరాల పాటు (జులై 2024-డిసెంబర్‌ 2027) వరకు కాంట్రాక్టుపై సంతకం చేయాల్సి ఉంటుంది. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. వార్షిక వేతనం సుమారు రూ.8-10 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.
నవతెలంగాణ-ముంబయి
భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ను టీమ్‌ ఇండియా తదుపరి చీఫ్‌ కోచ్‌ పదవికి బీసీసీఐ తగిన వ్యక్తిగా భావిస్తుంది. ప్రస్తుత చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ఈ ఏడాది 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. 2023 ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌తో రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియగా.. బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడగించిన సంగతి తెలిసిందే. పొట్టి ప్రపంచకప్‌ తర్వాత జట్టుతో పాటు కొనసాగేందుకు మిస్టర్‌ వాల్‌ విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. చీఫ్‌ కోచ్‌గా కొనసాగేందుకు ఆసక్తి లేదని భారత క్రికెట్‌ పెద్దలకు సమాచారం ఇవ్వగా.. బీసీసీఐ ఇప్పుడు కొత్త కోచ్‌ వేటలో నిమగమైంది. చీఫ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు మే 27 తుది గడువు.
గౌతీ నిర్ణయమే ఇక!: గౌతం గంభీర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో కోచింగ్‌ అనుభవం లేదు. కానీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రెండు ప్రాంఛైజీలకు మెంటార్‌గా పని చేశారు. లక్నో సూపర్‌జెయింట్స్‌ మెంటార్‌గా రెండు సీజన్లు బాధ్యతలు చేపట్టాడు. 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వచ్చారు. ఐపీఎల్‌ చరిత్రలోనే కోల్‌కత నైట్‌రైడర్స్‌ తొలిసారి గ్రూప్‌ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. లక్నో సూపర్‌జెయింట్స్‌ నుంచి గౌతం గంభీర్‌ మారుతాడని ఎవరూ ఊహించలేదు. షారుక్‌ ఖాన్‌ పట్టుబట్టడంతో మాతృ ప్రాంఛైజీ సహాయక సిబ్బంది బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐ పెద్దలు టీమ్‌ ఇండియా చీఫ్‌ కోచ్‌ పదవి చేపట్టాలని కోరటంతో.. గౌతం గంభీర్‌ ఏం నిర్ణయం తీసుకుంటాడా అనే ఆసక్తి నెలకొంది. అరంగ్రేట ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2007 విజయంలో, 2011 ఐసీసీ వరల్డ్‌కప్‌ సాధించిన భారత జట్టులో గౌతం గంభీర్‌ కీలక సభ్యుడు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఏడు సీజన్లలో నాయకత్వం వహించగా అందులో ఐదుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. 2012, 2014 సీజన్లలో నైట్‌రైడర్స్‌ను ఐపీఎల్‌ విజేతగా నిలిపాడు. 2014 చాంపియన్స్‌ లీగ్‌ రన్నరప్‌గా నిలిచిన జట్టుకు సారథ్యం వహించాడు.