– రెండు రోజుల వార్మప్‌కు దూరం
పెర్త్ (ఆస్ట్రేలియా): భారత జట్టు చీఫ్ కోచ్ గౌతం గంభీర్ మంగళవారం స్వదేశానికి బయల్దేరాడు. వ్యక్తిగత కారణాలతో గౌతం గంభీర్ పెర్త్ నుంచి నేరుగా న్యూఢిల్లీకి రానున్నాడు. దీంతో నవంబర్ 30 నుంచి కాన్‌బెర్రాలో ఆరంభం కానున్న రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండటం లేదు. రెండో టెస్టు మ్యాచ్ ఆరంభ సమయానికి గంభీర్ తిరిగి జట్టుతో చేరతాడని బోర్డు వర్గాల సమాచారం. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్‌లో టీమ్ ఇండియాతో చేరగా.. ఆ వెంటనే గంభీర్ జట్టుకు దూరమయ్యాడు. భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ఆరంభం కానుంది. డే నైట్ పింక్ బాల్ టెస్టు కోసం భారత జట్టు రెండు రోజుల వార్మప్‌లో సాధన చేయనుంది. వార్మప్ మ్యాచ్ డే మ్యాచ్ అయినా.. గులాబీ బంతి వాడనున్నారు. గంభీర్ గైర్హాజరీలో సహాయక కోచ్‌లు అభిషేక్, మోర్కెల్, రియాన్‌లు సంయుక్తంగా జట్టుకు ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎడమ చేతి బొటన వేలు గాయంతో పెర్త్ టెస్టుకు శుభ్‌మన్ గిల్ దూరం అయ్యాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ అందుబాటులోకి వస్తే ఆడిలైడ్ టెస్టులో మార్పులు అనివార్యం. దేవదత్ పడిక్కల్ బెంచ్‌కు పరిమితం కావటం ఖాయం. కానీ మరో స్థానం కోసం ఎవరిని పక్కనపెడతారో చూడాలి.