– అడిటర్‌గా వైదొలిగిన డెల్లాయిట్
– లావాదేవీల్లో విభేదాలు
న్యూఢిలీ: ప్రముఖ బిలియనీర్ గౌతం అదానీకి ఆడిటర్ డెల్టాయిట్ ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలు స్తోంది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లో ఆర్థిక లావాదేవీల్లో తేడాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. డెల్లా యిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ సంస్థ ఆడిటర్‌గా వైదొలిగినట్లు శుక్రవారం బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. ఆర్థిక లావాదేవీల రికార్డింగ్‌లో తేడాలు రావడమే ఇందుకు కారణం. కొన్నేళ్లుగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్‌గా డెల్లాయిట్ కొనసాగుతుంది. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లలో అవకతవకలు, మోసాలకు పాల్పడుతున్నదని గత జనవరిలో యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్‌గా డెల్లాయిట్ వైదొలుగుతుందని అనుమానాలు వ్యక్తం అవుతోన్నాయి.
కొన్ని లావాదేవీల విషయంలో కంపెనీ యాజమాన్యంతో డెల్లాయిట్‌కు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. 2017-18 నుంచి అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్‌గా డెల్లాయిట్ కొనసాగుతుంది. గతేడాది 2021-22లో కొనసాగింపు ఒప్పందాన్ని కుదర్చుకుంది. వచ్చే ఐదేళ్లకు గాను ఆడిటర్‌గా నియమించుకుంది. అదాని పోర్ట్స్ స్థానిక చట్టాలకు లోబడి అదానీ కంపెనీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయన్న సంగతి ధృవీకరించు కోలేదని డెల్లాయిట్ హాస్కిన్స్ పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఆరోపణాలపై విస్తృత దర్యాప్తు చేసిన డెలాయిట్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఆడిటింగ్ సంస్థగా వైదొలగనున్నట్లు వచ్చే రెండు మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలుపడొచ్చని అంచనా. డెలాయిట్ స్థానంలో బిడిఒ ఇండియా ఎల్‌ఎల్‌పిఎస్ సంస్థను ఆడిటర్‌గా నియమించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశంపై డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, బిడిఒ, అదాని పోర్ట్స్ కానీ అధికారికంగా స్పందించలేదు.