– కొత్త ప్రాంతాలకు విస్తరించిన దాడులు
– ఖాన్ యునిస్ దిశగా సాయుధ బలగాలుొ 800మందికి పైగా మృతి
– 19లక్షల మందికి పైగా నిర్వాసితులు
గాజా : మృత దేహాలతో గాజా ఆస్పత్రులు నిండిపోతున్నాయని గాజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్ బర్ష్ తెలిపారు. సోమవారం తెల్లవారు జాము నుండి ఆస్పత్రులకు వరసగా మృతదేహాలు వస్తూనే వున్నాయని చెప్పారు. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత వరుసగా నాలుగు రోజుల నుండి ఇజ్రాయిల్ మిలటరీ దక్షిణ గాజాలో విరుచుకు పడుతోంది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది. గాజా వ్యాప్తంగా గల ఇళ్ళు, వాణిజ్య కేంద్రాలు, శరణార్ధ శిబిరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు కొనసాగుతున్నాయి. శనివారం నుండి ఇప్పటివరకు 800మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్ సైనికులు పెద్ద ఎత్తున వైద్య పరికరాలన్నింటినీ ధ్వంసం చేయడంతో అన్ని ఆస్పత్రులు బాధితులకు ఎక్కువ కాలం సాయాన్ని అందించలేకపోవచ్చని బర్ష్ చెప్పారు. కమల్ అద్వాన్ ఆస్పత్రిలో కొద్ది గంటల్లోనే అంథకారం నెలకొంటుందని హెచ్చరించారు. అంబులెన్సులు, వైద్య సిబ్బందిని పదే పదే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. అల్ అద్వా ఆస్పత్రికి తీసుకెళుతున్న ఒక ఆరోగ్య సంరక్షణ కార్యకర్తని కాల్చి చంపారు. 40వేల మంది గాయపడితే, కేవలం 400మంది రఫా క్రాసింగ్‌ను చేరుకోగలిగారని డైరెక్టర్ తెలిపారు. అమాయకులైన ప్రజలను దారుణంగా చంపేస్తున్నారని విమర్శించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో తెల్లవారు జామున ఇద్దరు పాలస్తీనియన్లను కాల్చి చంపగా, 60మందిని అరెస్టు చేశారు. ఇజ్రాయిల్ దాడుల్లో 75శాతానికి పైగా బాధితులు మహిళలు, పిల్లలే. రెడ్‌క్రాస్ చీఫ్ సోమవారం గాజాలో పర్యటించారు. తక్షణమే సాయం అందాలని ఆయన కోరారు.
సోమవారం ఉదయం నుండి ఇజ్రాయిల్ ట్యాంకులు, సాయుధ వాహనాలు తూర్పు ప్రాంతం నుండి ఖాన్ యునిస్ దిశగా వెళుతున్నాయి. సాలా అల్ దిన్ హైవేకు తూర్పువైపు గల ప్రజలంతా వెంటనే అక్కడ నుండి ఖాళీ చేయాలని, రఫా దిశగా వెళ్ళాలని మిలటరీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు గాజాలో 19లక్షల మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్ధుల సహాయ సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) తెలిపింది. అంటే గాజాలో దాదాపు 80శాతం పైగా ఖాళీ అయిపోయింది. ఉత్తర గాజాలో టెలికం సర్వీసులు పూర్తిగా కుప్పకూలాయి.
ఇదిలావుండగా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో రాత్రంతా, తెల్లవారు జామున జరిపిన దాడుల్లో పలువురు పాలస్తీనియన్లను అరెస్టు చేశారు. గాజా నగరానికి తూర్పున షుజయె ప్రాంతంలో జరిగిన దాడిలో 50కి పైగా నివాస భవనాలను ధ్వంసం చేశారు. గాజాలో ఇప్పటివరకు సగానికి పైగా ఇళ్ళను ధ్వంసం చేశారు. ఆస్పత్రులతో సహా మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించారు. అక్కడ జరిగిన విధ్వంసకాండను చూపిస్తూ విదేశాంగ శాఖ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. తమ వస్తువులు కోసం అక్కడి ప్రజలు ఆ శిధిలాల్లో జరుపుతున్న వెతుకులాట కనిపిస్తోంది. వందలాదిమంది చనిపోయారని, వందల సంఖ్యలో గాయపడ్డారని విదేశాంగ శాఖ పేర్కొంది. మరికొంతమంది శిధిలాల్లో చిక్కుకున్నారని భయపడుతున్నారు.