గాజా యుద్దకాండ కవిత

ఏలి ఏలి లామా సభక్తాన్ని..
తండ్రియైన దేవా నీ వేల మా చేయి విడిచితివా….
మమ్ముల పై మా మితిమీరిన కాంక్ష తో నిన్ను మరచితిమా….
ఎప్పుడో చదివినట్టుందా వాక్యం..
ప్రపంచానికి రుధిర భూమి సాక్షిగా శాంతి ప్రవచనాలు అందిద్దాం
ప్రపంచమా మేలుకొని చెవియొగ్గుము..
దేవభూమి లో దహనకాండ
చెవులున్నవారు విందురుగాక.. కనులున్నవారు చూసి తరింతురు గాక
పశ్చిమాసియా అవనీతల నాభి మండలం..
ఆదికాండం ఆదాం అవ్వ మొదటి కథ పరమార్థం ఏమిటి?
నోవాహు జలప్రలయం పుట్టింది నిజమో కాదో..
బాంబుల వర్షంలో మిస్సైల్‌ దాడిలో గాజా నేలమాళిగలు చిద్రమైంది చూస్తున్నాం..
యుద్ధాన్ని కలగంటున్నాం యుద్ధంలో నడుస్తున్నాం..
యుద్ధంలో జీవిస్తున్నాం..
జరుగుతున్న విపత్తులకు సాక్షిభూతంగా నిలుస్తున్నాం..
వందేండ్ల ప్రపంచ యుద్ధం పాఠాలుగా చదువుతూ మానవ హననానికీ పతకరచన చేస్తున్నాం..

సామూహిక దు:ఖంతో సామూహిక దహనకాండ….
రాతిగుహల రాసినా రాక్షసానంద కేళీ
దేవుడు పుట్టిన భూమి
మూడు మతాలు మెట్టిన భూమి లో మెస్సయ్య మళ్ళి వస్తాడా ..
పాపపంకిలమైన నరచరితను విమోచన చేస్తాడా..
ఏసుక్రీస్తు సిలువ మోసింది జాతుల సమూల నిర్మూలన కేనా ..
ఒక చెంపమీద కొడితే మరొక చెంపమీద కొట్టమన్నది నిజం కాదా..

ఎరుషలేమా నీ పవిత్రత ఎక్కడా?
ఓరి ఇజ్రాయిల్‌ యోధుడా బైబిల్‌ గ్రంధంలో నీ ఆనవాలు మసక బారుతోందా..

పాలస్తీనాకు రాసిన పత్రిక మతలబు ఏమిటి?
అన్యులను ప్రేమించిన ఏసు ఎక్కడీ
పొరుగు వారిని, దాయాదులైన వారిని ద్వేషించు మతం ఎక్కడీ
ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే..
ఒకరికి ఇంకొకరు ఏమికారు ..
జాతుల వైరము.. మతాల వైరుధ్యం .. విరుద్ధ బావప్రకటనలతో
ఎవడి అస్థిత్వం వాడే చాటుతాడు
ఎటొచ్చి ఎటుచూసినా మరణ మృదంగపు సైరన్‌ వినిపిస్తూనే వుంటది గన్‌ పౌడర్‌ ప్రాణవాయువుగా రూపు దిద్దుకుంటది..
వేన వేల ఏళ్ల చరితం సమస్తం కల్లోలితం

అక్కడ ఒక తండ్రి బొండిగెఊపిరాకిన కొడుకును చూస్తూ బోరున విలపిస్తుండు
అక్కడో మాతమూర్తి నెత్తురోడుతున్న తన పేగు బంధాన్ని చూసి నడివీదుల అహంకారాలు చేస్తుంది ఒకవైపు సైరన్‌ వినిపిస్తుంటే మరొకవైపు నిశ్శబ్దానికి ఛేదిస్తూ దూసుకు వస్తున్న మిస్సైలు గాజా గాయాల నగరం నేలమట్టం
గాజా గజగజ వణుకుతూ విలవిలలాడుతూ కన్నీటి పర్యంతం
ఆది అంతం అంతా కళ్ళముందు చూస్తున్నట్టే ఉంది ఏమి జరుగుతుందో ఇట్టే తెలిసిపోతునట్టేవుంది

వేల ఏండ్ల ఒక జాతి చరిత్ర మట్టి పొరలలో ఇంకిపోతుంది భద్రపరచడానికి పురావస్తు శాఖ కాచుకునే ఉంటది ఐక్యరాజ్యసమితి నక్క వినయాలు నటిస్తూనే ఉంటది దేశం ఏదైనా కొత్త జాతులకు అంకురార్పణ జరుగుతది
పాత మతాలు రూపాంతరం చెందుతాయి
వేటగాని పిట్ట కథలు కట్టుకథలు చలామణిలో ఉంటాయి
నిజానికి పాతరా
కాలం సాక్షిగా నియంతల జాతర

ఇప్పుడు గాలి నీరు దుమ్మూ దూళి కలుషితమై ఓజోన్‌ పొరకు చిల్లు పడుతది..
నిందల సభలు కౌగిలింతతో కరచాలనం చేసుకుంటది..
ప్రపంచం రెండుగా చీలుతదీ..
అడగకుండానే ఆయుధాలు సరిహద్దుల దాటి తుప్పు వదిలించుకుంటాయి..
జననం మరణం తేదీల్లో చేరుతాయి ..
సంఘం చెక్కిన శిల్పం వంచన అల్‌ అక్సా నిలవడి చూస్తున్నట్టు మ్యూజియంలో చోటు దక్కించుకుంటది
శవాల దిబ్బలో పసిపిల్లలు కొత్త కథకు వారథి కడతారు..
పదాలు మిగిలే వుంటాయి..
రేపుకు మీరెవరో తెలియదు
ఒక ఆశ శ్వాస దిక్కులు చూస్తున్నట్టుంది..
శిధిలమైన జీవితాల శిథిల నాగరికత కు
శరత్కాల శిశీర వదనాలు.. – భూతం ముత్యాలు