గాజా మరణాల సంఖ్య 8 వేలకుపైనే..

Gaza's death toll is over 8,000.– గాయపడిన వారి సంఖ్య 20వేల మందికి పైనే..!
– మీడియా కథనాలు
– అక్కడి పరిస్థితులపై యూఎన్‌ చీఫ్‌ ఆందోళన
న్యూయార్క్‌: ఇజ్రాయిల్‌ సైనిక చర్యతో గాజాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇక్కడ మృతుల సంఖ్య 8 వేలు దాటింది. 20 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే రికార్డులకెక్కని మరణాలు భారీగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ దురాక్రమణ ఈ ప్రాంతంలోని పాలస్తీనియన్ల జీవితాలపై వినాశనం కొనసాగిస్తున్నదని సామాజికవేత్తలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ సైనిక చర్యను ముమ్మరం చేయడంతో శుక్రవారం ఆగిపోయిన గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను ఆదివారం పునరుద్ధరించినట్టు ఇంటర్నెట్‌ ట్రాకర్‌ నెట్‌బ్లాక్స్‌ తెలిపింది. ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ సైతం గాజాలో పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చారు. గాజాలో పరిస్థితి గంటకు మరింత నిరాశాజనకంగా మారుతున్నదన్నారు. ”గాజాలో పరిస్థితి గంట గంటకు మరింత నిరాశాజనకంగా మారుతున్నది. ఇజ్రాయెల్‌ తన సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేసిందని నేను చింతిస్తున్నాను” అని నేపాల్‌లోని ఖాట్మండులో మాట్లాడుతూ ఆయన అన్నారు.