– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి వర్ధంతి సభ
నవతెలంగాణ-కల్చరల్
పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షురాలిగా గీతారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం కోసం విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో నల్లగొండ జిల్లా నుంచి డిజిటల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు జరిగిందని, ఆ జిల్లా బాధ్యత వహించిన గీతారెడ్డిదే ఈ ఘనత అని చెప్పారు. మహిళా, బడుగు బలహీన వర్గాల హక్కుల ఉద్యమకారిణి జె.ఈశ్వరీబాయి 33వ వర్ధంతి సభ హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రధాన వేదికపై ఈశ్వరీబాయి ట్రస్ట్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో జరిగింది. ఈశ్వరీబాయి చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో కూడా మహిళలు రాజకీయాల్లో రాణించటం సులువుకాని పరిస్థితి ఉంటే.. నాలుగున్నర దశాబ్దాల కిందటే స్వాతంత్ర అభ్యర్థిగా గెలిచి శాసన సభలో అడుగు పెట్టి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గళమెత్తిన గొప్ప పోరాట యోధురాలు ఈశ్వరీబాయి అని కొనియాడారు. తొలి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అంకిత భావంతో పాల్గొన్న ఆమె జీవితాంతం తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. గీతక్క ఆరోగ్య రీత్యా పోటీ చేయకపోవటం వల్ల మంత్రివర్గంలో లేకపోవటం బాధాకరమే అయినా.. ఆమెకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఆమె సేవలను విస్మరించబోమని చెప్పారు.
స్వాగతం పలికిన ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ.. ఈశ్వరీబాయి అగ్ని శిఖ వంటి వారని, ఆమె కుమార్తెగా పుట్టటం నా అదృష్టం అని చెప్పారు. ఈశ్వరీబాయి స్ఫూర్తితో తాను ముందుకెళ్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వరీబాయిపై లఘు చిత్రం ప్రదర్శించారు. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించిన సభలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్, ట్రస్ట్ నిర్వాహకుడు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.