– రాజస్థాన్ ఎన్నికల్లో ప్రభావం చూపనుందా..!
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ సమీపిస్తోంది. రాష్ట్రంలో 25న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ తన ఏడు ఎన్నికల హామీలలో ‘పాత పెన్షన్ స్కీమ్'(ఓపీఎస్)కి లీగల్ గ్యారెంటీ హౌదాను ఇచ్చి దాన్ని మొదటి స్థానంలో ఉంచింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ తన ర్యాలీల్లో ‘ఓపీఎస్’ అంశాన్ని బలంగా లేవనెత్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ఎన్నికలలో ‘పాత పెన్షన్’ గురించి చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఓపీఎస్‌కు లీగల్ స్టేటస్ ఇప్పిస్తానని పాచిక విసిరారు. అయితే ఆయన ఎత్తుగడలో రాజకీయ చిక్కులుండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్‌పీఎస్‌కు సంబంధించిన డబ్బు కేంద్రం వద్ద జమై ఉంది. ఆ డబ్బు ఉద్యోగులదే అయినా కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో చేర్చిన ఓపీఎస్‌కు రాష్ట్రంలో చట్టబద్ధత లభించినా.. మరే ఇతర పార్టీ ప్రభుత్వమైనా ఆ చట్టాన్ని రద్దు చేయదన్న గ్యారెంటీ లేదు. అలాంటి పరిస్థితిలో, చట్టపరమైన స్థితికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు.
చట్టపరమైన హోదా అంటే ట్రస్ట్
ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. రాజస్థాన్ ప్రభుత్వం ఓపీఎస్‌ని కేవలం ఎన్నికల హామీకి పరిమితం చేయలేదని, దానికి చట్టబద్ధమైన హోదాను కూడా కల్పిస్తుందని ఉద్యోగులకు హామీ ఇస్తోంది. ఇప్పుడు ఈ హౌదా ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఉంది. మరి కొన్ని ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఈ హౌదాను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. చట్టాన్ని మార్చవచ్చు. ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుత రాజస్థాన్ ప్రభుత్వం ఓపీఎస్‌ను అమలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చట్టబద్ధమైన హౌదా ఇస్తామని ఎన్నికల హామీలో పేర్కొంది. మరోవైపు బీజేపీ మ్యానిఫెస్టోలో ‘ఓపీఎస్’ ప్రస్తావన లేదు. ఎన్‌పీఎస్‌లో ఉద్యోగులు జమ చేసిన డబ్బు భారత ప్రభుత్వ ఆధీనంలో ఉందనేది కూడా నిజం. ‘పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ’ (పీఎఫ్‌ఆర్‌డీఏ)లో డిపాజిట్ చేసిన డబ్బును కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలకు ఇవ్వలేమంటూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది.
ఆల్ రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ జాయింట్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తేజ్ సింగ్ రాథోడ్
షాకింగ్ ఫలితాలు రావచ్చు
తేజ్ సింగ్ రాథోడ్ ప్రకారం.. ఈ విషయంలో భారత ప్రభుత్వం సహకార వైఖరిని అవలంబించాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ని అమలు చేసినప్పుడు, అంతకు ముందు ఉద్యోగులను అడగలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు ఓపీఎస్, ఎన్‌పీఎస్‌ల ఎంపికను ఇవ్వాలి. ఉద్యోగులు తమకు ఓపీఎస్ పున్ణస్థాపన కావాలా లేదా ఎన్‌పీఎస్‌లో ఉండాలా అనేది స్వయంగా నిర్ణయించు కోవాలి. అలాగే పీఎఫ్‌ఆర్‌డీఏ నిబంధనలను మార్చాలి. రాజస్థాన్ ఎన్నికల్లో ఓపీఎస్ ప్రభావం కనిపించనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాకింగ్‌గా ఉంటాయని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఓపీఎస్) జాతీయ అధ్యక్షుడు విజరు కుమార్ బంధు అన్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు అధికార సమీకరణాన్ని చెడగొట్టడానికి సరిపోతాయనే చర్చ నడుస్తోంది. రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్‌కు పూర్తి మద్దతుగా ఓటు వేస్తే, ఎన్నికల ఫలితాలు షాకింగ్‌గా మారవచ్చు. రాజస్థాన్‌లో తొమ్మిది నుంచి పది లక్షల మంది పనిచేస్తున్న/రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి కుటుంబాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమీకరణం చేయడానికి ఈ సంఖ్య సరిపోతుందని గెహ్లాట్ వర్గీయులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.