భారత రత్నాలు

Gems of India– మాజీ ప్రధానులు పివి, చరణ్‌ సింగ్‌.. వ్యవసాయ శాస్త్రవేత్త
– ఎంఎస్‌ స్వామినాథన్‌కు అత్యున్నత పౌర పురస్కారం
– తొలి తెలుగు భారత రత్న గ్రహీత పీవీ నరసింహారావు
– బతికున్నప్పుడు ఇచ్చి ఉంటే నాన్న సంతోషించేవారు : సౌమ్య స్వామినాథన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌, హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు సైతం కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వానీ, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం ఇటీవలే భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయింది. సాధారణంగా ఏడాదికి మూడు భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఐదుగురికి ఈ పురస్కారాన్ని ప్రకటించడం గమనార్హం. చౌదరి చరణ్‌ సింగ్‌ 1979 జూలై 28 నుంచి 1980 జనవరి 14 మధ్యకాలంలో, పీవీ నరసింహారావు 1991 జూన్‌ 21 నుంచి 1996 మే 16 వరకు దేశ ప్రధానమంత్రులుగా సేవలందించారు. చౌదరి చరణ్‌ సింగ్‌ ఉప ప్రధాని (1979), కేంద్ర ఆర్థిక (1979), హోం (1977-78), ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి (1970) బాధ్యతలు కూడా నిర్వర్తించారు. పివి నరసింహారావు కేంద్ర హౌం (1986), రక్షణ (1993-96), విదేశీ వ్యవహారాల (1992-94) మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (1971-73)గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక హరిత విప్లవ పితామహుడైన ఎంఎస్‌ స్వామినాథన్‌ దేశానికి ఎనలేని సేవలందించారు. ఎంఎస్‌ స్వామినాథన్‌ను 1967లో పద్మశ్రీ, 1971లో రామన్‌ మెగసెసే అవార్డు, 1972లో పద్మ భూషణ్‌, 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌, 1989లో పద్మ విభూషణ్‌ అవార్డులు వరించాయి.ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ దేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్‌ సింగ్‌ను రైతుల సంక్షేమం కోసం కృషిచేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకుంటున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్ర హౌం మంత్రిగా పని చేసిన చరణ్‌ సింగ్‌ రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తినిచ్చేవిగా నిలిచాయనీ, దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలను గౌరవించడం ప్రభుత్వానికి దక్కిన అదృష్టమని ప్రధాని మోడీ కొనియాడారు.
”మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించటం ఆనందంగా ఉంది. ప్రముఖ పండితుడు, రాజకీయవేత్త అయిన నరసింహారావు వివిధ హోదాల్లో విస్తృత సేవలందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్‌, అసెంబ్లీ సభ్యునిగా ఎన్నో ఏండ్లుగా ఆయన విశేష కృషి చేశారు. నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆర్థిక రంగంలో కొత్త శకానికి నాంది పలికింది” అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.”దేశానికి చేసిన విశేష కృషికి గానూ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వడం సంతోషకరం. సంక్షేమానికి వ్యవసాయం, రైతులు మూలస్తంభాలు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వ్యవసాయంలో పెనుమార్పులు తీసుకువచ్చారు. దేశ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా విశేష కృషి చేశారు. ఒక ఆవిష్కర్తగా, మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన ముందుచూపు వ్యవసాయం రూపరేఖలు మార్చడమే కాకుండా ఆహార భద్రతకు హామీ ఇచ్చింది” అని ప్రధాని కొనియాడారు.
స్వాగతిస్తున్నాం : సోనియా గాంధీ
కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత రత్న అవార్డులపై స్పందించారు. పార్లమెంట్‌లో మీడియాతో ‘వారికి భారత రత్న ఇవ్వడాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను’ అని అన్నారు.
నాన్న బతికున్నప్పుడు ఇచ్చుంటే సంతోషించేవారు: సౌమ్య స్వామినాథన్‌
స్వామినాథన్‌ కుమార్తె, మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌, డబ్ల్యూహెచ్‌ఓ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ స్పందించారు. నాన్న బతికున్నప్పుడు ఈ అవార్డు దక్కి ఉంటే సంతోషించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు దక్కడంపై సంతోషంగాను, గర్వంగానూ ఉందన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదని, గుర్తింపుకోసం ఎదురు చూడలేదని తెలిపారు. చాలా అవార్డులు ఆయనకు దక్కాయని పేర్కొన్నారు. తను చేసిన పనికి వచ్చిన ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారని, ఆయన జీవితమంతా రైతుల ప్రయోజనాల కోసం పాటు పడ్డారని తండ్రి సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా ఆయన కలిసిన రైతులను గుర్తు పెట్టుకునేవారని అన్నారు.