తరాల తెలుగు సాహిత్యాంశాలు

ఈ వ్యాస సంపుటిని డా||కె.వి.రమణాచారి గారికి అంకితం చేశారు. డా|| గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, కె.వి.కిశోర్‌కుమార్‌ చక్కటి ముందు మాటలు రాశారు. ఇది అక్షర సాహిత్య విందు భోజనమే.
భరతుడు, భామహుడు, చెళ్లపిళ్ల, గురజాడ, బెర్నార్డ్‌షా, శ్రీశ్రీ, చలం, జిడ్డు కృష్ణమూర్తి, విశ్వనాథల ప్రయోగాలు, తాత్త్వికాంశాలు ఎన్నో అలనాటి సాహిత్య విశేషాలను పాఠకుల్ని ఆసక్తిగా చివరి పేజీ దాకా ఏక బిగువున చదివిస్తూ తీసుకెళ్తాయి. పురాణేతి హాసాల్లోని అంశాల దగ్గర నుండి తొలి సంస్కర్త బసవేశ్వరుడు దాకా ఎన్నో విషయాల వివరాలు ఈ వ్యాసాల్లో వున్నాయి. ఈనాడు పత్రికల్లోని వ్యాసాల సమాహారం ఇది. (రెండవ భాగం) ఇక ఇరవై ఏళ్ల కిందట రాసినవైనా తాజాగా అనిపిస్తాయి. మనకాలం మహాకవులైన సినారె, శేషేంద్ర, శివారెడ్డి లాంటి వారి ప్రస్తావనల దగ్గరనుంచి అలనాటి కవులు నన్నయ్య, పాల్కురికి, రాయప్రోలు, గురజాడ ల దాకా ఎన్నో విషయాలు, విశేషాలు చెప్పి గత వైభవ ప్రాభవాన్ని సాక్షాత్కరింపజేశారు సుందరయ్య.
సంస్కృతి, సంస్కృతం ముడిపడ్డ పురాణాలు, బుర్రకథలు, హరికథలు, యక్షగానాలు, నాటకాలు, తెలుగు జాతి సొత్తు అయిన పద్యం, అవధానం, క్రైస్తవ – ముస్లిం సాహిత్యం, తాత్త్వికుల పరిచయాలు, సమాజంపై వీరి ప్రభావం అద్భుతంగా విశ్లేషించారు. వివిధ వాదాలూ రాశారు. శ్రీశ్రీ, బాద్లేర్‌, ఎలెన్‌ పో ముపాసా వ్యక్తిత్వాన్ని బేరీజువేస్తూ రాసిన వ్యాసం (కొన్ని సామ్యాలు) చాలా విలువైనది. పరిశోధనాత్మకమైనది.
1660 ప్రాంతంలో ప్రారంభమైన కాల్పనిక వాదంపై (పేజీ.120) విశ్లేషణ ఆలోచింపజేస్తుంది. అలాగే వీరూ మన విద్వద్విమర్శకులు (పేజీ 142) బెంగాలీ కవుల గురించి రాశారు. చీకోలు సుందరయ్య కృషి ప్రశంసనీయం. ఈ పుస్తకం రచయితలకు, కవులకు, జర్నలిస్టులకు, విమర్శకులకు, సాహిత్య అధ్యయన వాదులకు, పరిశోధకులకు, తెలుగు భాషాప్రియులకు విలువైన చక్కటి కరదీపిక.
– తంగిరాల చక్రవర్తి, 9393804472