ఉక్రెయిన్‌కు నిధులను సమకూర్చటానికి ప్రపంచ వ్యాప్తంగావున్న రష్యా ఆస్తులను కొల్లగొట్టేందుకోసం చట్టాలలోవుండే లొసుగులను అన్వేషించాలని అమెరికా పశ్చిమ దేశాలకు సూచిస్తోందని రష్యా విదేశాంగ శాఖా మంత్రి సెర్గీ లవ్రోవ్ గురువారమొక పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఉల్లంఘించారనే పేరుతో ఫ్రాంక్ఫర్ట్ లోని రష్యన్ బ్యాంక్ అకౌంట్‌లో గల 800మిలియన్ డాలర్ల సంపదను కైవసం చేసుకోవాలనే ప్రణాళికను జర్మన్ అధికారులు తెలిపారు. జర్మన్ అధికారులకు దొంగతనం చేసే జబ్బు ముదిరిందని లవ్రోవ్ అన్నార. ”వాళ్ళకు దొంగ బుద్ధి ఉందని మాకు చాలాకాలం క్రితమే తెలిసింది. ఒప్పందాలను అమలు చేయకుండా ఇతరులను మోసం చేసే ప్రయత్నం చేయటం అందులో ఒకటి. ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్షంగా దొంగలుగా మారారు”. అని లవ్రోవ్ ట్యునీషియా పర్యటన తరువాత ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో చెప్పారు. ముందుగా ఘనీభవింపజేసిన రష్యా ఆస్తులపై వచ్చిన వడ్డీని ఉక్రెయిన్‌కు మరలించటంతో ప్రారంభించి రష్యా ఆస్తులను కైవసం చేసుకోవటానికి చట్టంలో లొసుగులు ఏమైనా దొరుకుతాయేమోనని పశ్చిమ దేశాల అధికారులు అన్వేషిస్తున్నారు. ”ఐరోపావాసులకు తమ చట్టాలపై కొంచెం గౌరవం మిగిలివుంది. అందుకే వాళ్ళు నిర్ణయాలను తీసుకోవటానికి ఆలస్యం చేస్తున్నారు. అయితే మాకున్న సమాచారం ఏమంటే ఎలాగైనా అవసరమైతే చట్టాలను మార్చైనా రష్యా ఆస్తులను కైవసం చేసుకోవాలని అమెరికా సలహా ఇస్తోంది” అని లవ్రోవ్ వివరించాయి. గత సంవత్సరం జి-7 దేశాలలో, యూరోపియన్ యూనియన్‌లో, ఆస్ట్రేలియాలో గల 285 బిలియన్ల రష్యన్ కేంద్ర బ్యాంకు ఆస్తులను ఘనీభవింపజేశారు. ఐరోపాలో 230 బిలియన్ డాలర్ల రష్యన్ రిజర్వ్ నిధులున్నాయని అంచనా. వీటిలో 191 బిలియన్ బెల్జియంలో, 19 బిలియన్ ఫ్రాన్స్‌లో, 7.8 బిలియన్ స్విట్జర్లాండ్‌లోనూ ఉన్నాయి. జర్మనీ ఫైనాన్స్ సంస్థలలోగల 5.3 బిలియన్ యూరోల రష్యా నిధులను జర్మనీ బ్లాక్ చేసింది. ఇప్పుడు జెపి మోర్గాన్ లోగల రష్యన్ నిధులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. తాము ఘనీభవింపజేసేన తమ నిధులపై వచ్చే లాభాలను తరలించాలని ప్రయత్నిస్తే తమ వైపు నుంచి ప్రతి స్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని రష్యా ఆర్థిక మంత్రి అంటోన్ సైల్యుయానోవ్ హెచ్చరించారు. తమకు మిత్రులుకాని దేశాలకు కూడా తమ బ్యాంకు అకౌంట్లలో భారీగానే నిధులు ఉన్నాయన్న విషయాన్ని ఈ దేశాలు గుర్తుంచుకోవాలని సైల్యుయానోవ్ అన్నారు.