– పార్టీకి మీరే కండ్లు, చెవులు…
– లోక్‌సభ స్థానాల కో- ఆర్డినేటర్లకు పార్టీ చీఫ్ ఖర్గే దిశా నిర్దేశం
– తెలంగాణ, ఏపీతో సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకో ఆర్డినేటర్లతో కీలక భేటీ
– సోనియా గాంధీ తెలంగాణ లో పోటీ చేయాలని అభ్యర్థించాం: భట్టి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ నియమించిన లోక్‌సభ స్థానాల కో-ఆర్డినేటర్లే అధిష్టానానికి కండ్లు, చెవులని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు దగ్గరవడంతో పాటు, దక్షిణాది రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలిచేలా పని చేయాలని సూచించారు. ఈ దిశలో ఎక్కువ స్థానాలు గెలిపించే బాధ్యత కో ఆర్డినేటర్లపైనే ఉందని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సూచించారు. ఆ దిశలో కో ఆర్డినేటర్లు, క్షేత్రస్థాయిల్లో లీడర్లను కలుపుకొని గెలుపు దిశగా ముందుకుసాగాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికలకు సమయాత్తంలో భాగంగా… గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తొలుత తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన లోక్‌సభ నియోజకవర్గాల కాంగ్రెస్ కో-ఆర్డినేటర్లతో మల్లికార్జున ఖర్గే కీలక భేటి నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, అండమాన్ నికోబార్ దీవుల లోక్‌సభ నియోజకవర్గాల కాంగ్రెస్ కో-ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు.
ఈ భేటీలో… తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ముఖ్య నేతలు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఏపీ నుంచి తులసి రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాలు, ఎన్నికల నిర్వహణ, ప్రజలతో మమేకమవడం వంటి అంశాల్లో మార్గ నిర్దేశం చేశారు. ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులతో కలుపుకు పోయే అంశం, కో -ఆర్డినేటర్ల పనితీరు కు సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 106 లోక్ సభ స్థానాలకు గాను మెజార్టీ స్థానాల్లో గెలవాలని సూచించారు. దక్షిణాధి రాష్ట్రాల నుంచి అనుకున్న రీతిలో సీట్లు రాబట్టగలిగితే… ఉత్తరాధి నుంచి ఇండియా కూటమితో బిజెపికి కళ్లేం వేయవచ్చని సూచించారు. అలాగే కో-ఆర్డినేటర్ల కోసం ఢిల్లీలో వార్ రూం ఏర్పాటు చేస్తున్నట్టు నేతలకు తెలిపారు. ఆయా నేతలకు కేటాయించిన స్థానాల్లో వారే కండ్లు, చెవులు గా పని చేసి … పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచనలు చేశారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంతో పాటు, క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులు, ఇతర నేతలన్ని కలుపుకొని పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని అభ్యర్థించాం: భట్టి
తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా చూడాలని అధిష్టానాన్ని అభ్యర్థించినట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన ప్రొగ్రాంలపై ఖర్గే దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే… లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందెలా ప్రణాళికలు, యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని పని చేస్తామన్నారు. మెజారిటీ స్థానాలు గెలిపించే బాధ్యత కో-ఆర్డినేటర్లపై ఉందని ఖర్గే దిశానిర్దేశారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలు ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని చెప్పారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని, అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికలకు వెళ్తామన్నారు.
రెండు, మూడు స్థానాల కోసం బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పోటీ…: పొన్నం
రాష్ట్రంలోని 17 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి పొన్నం అన్నారు. అయితే రెండు మూడు స్థానాల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉంటుందన్నారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని వివరించారు. 17 స్థానాల్లో గెలిపిస్తే ఆరు గ్యారెంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
13 నుంచి 14 స్థానాల్లో గెలుపు మాదే: ఉత్తమ్
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ లో 13 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానంలో మూడు లక్షల మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించుకుంటాని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసిందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఏఐసీసీ అగ్రనేతలు నిర్మాణాత్మక సూచనలను చేశారని మంత్రి సీతక్క అన్నారు. తమకు బాధ్యత కల్పించిన స్థానాలలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా పోరాడుతామన్నారు. తొందరలోనే అభ్యర్థుల పేర్లను అధిష్టానం కి నివేధించి, ఫిబ్రవరి లోపు ఎంపి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని చెప్పారు. తనకు కేటాయించిన ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని అధిష్టానానికి నివేదిక ఇస్తామని వెల్లడించారు. అభ్యర్థి ఎవరైనా అధిష్టానం నిర్ణయం మేరకు పనిచేస్తామన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా… మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.