ఆకటికి పరిగేరుకున్నట్టు
కొన్ని పదనగల్ల అక్షరాలు
ఏరుకునుడు ఇష్టం.
గడ్డివాము ముందట
తుర్తిగ గింజలేరుకుంటూ
కత్తెర్లలాగా రెక్కలాడిస్తూ
పిచ్చుకలు పాడే మట్టిపాటకు
దండం బెట్టుడు ఇష్టం.
కల్లం బండ మీద
ఉసుకె కలువని దినుసు వోలె
బతుకును తూర్పాల
వట్టుకునుడు ఇష్టం.
పొలంగెట్టు కాడ
సితపల్కచెట్టులా పల్వరిల్లుడు ఇష్టం.
ఎండుగను ముద్దాడే
మొక్కిసిపురుకట్టను
ఎదన నిలుపుకునుడు ఇష్టమే.
కానీ కడుపుల పేగులులేని రైతన్న
యాటింత కన్నీటి తవుసు వడుతాంటే
సూసుడే వశం గాదు.
– నాగిళ్ళ రమేశ్