సమాజసేవలో సైతం రాణిస్తున్న ఘనాపాటి

– బడిబాట, పఠనోత్సవం, మనఊరు-మన బడిలో అవిరళ కృషి 
– నేర్పిన విద్యాబుద్ధులతో పలు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు
– భూక్య రమేష్ సేవలను ప్రభుత్వం, విద్యాశాఖ గుర్తించాలి  
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ప్రభుత్వ విద్యా రంగంలో ఉపాధ్యాయుడిగా జనవరి 19, 2002లో విధుల్లో చేరి నేటికి దాదాపు 22 సంవత్సరాల అపార అనుభవంతో ఇప్పటికీ ఆళ్ళపల్లి మండల కేంద్రంలో ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న భూక్యా రమేష్ సేవలు ఆళ్ళపల్లి మండల ప్రజలకు చిరస్మరణీయం. మండల కేంద్రంలో తన దగ్గర విద్యా బుద్ధులు నేర్చుకున్న శంకరభక్తుల శ్రావణ్, మొహమ్మద్ ఫారుఖ్, బచ్చలబోయిన కృష్ణ లాంటి అనేక మంది శిష్యులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. దాంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు సంపాదించిన వారు సైతం ఉన్నతంగా జీవిస్తున్న అనేక మంది ఆయన శిష్యులు ఉన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో చేపట్టిన హరితహారం  కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఏడాది ఆయా పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చురుగ్గా చేపట్టారు. నిరుపేదలకు ఉపయోగపడాలని ప్రత్యక్షంగా సోషల్ సర్వీస్ రక్తదాన శిబిరాలకు, ప్రభుత్వ ఉచిత రక్తదాన శిబిరాలకు ముందుండి నిర్వహించడం, అలాగే అత్యవసరంగా రక్తం   అవసరమైన సమయాల్లో తన రక్తాన్ని ఇచ్చి మానవత్వం చాటిన సందర్భాలూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తన పాఠశాల నుంచి విద్యార్థులు గురుకులం పాఠశాలలకు ఎంపిక అయ్యేందుకు మెటీరియల్ తో పాటు సరైన శిక్షణ ఇవ్వడంలో వృత్తి, పిల్లల పట్ల ఆయన అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రభుత్వ బడిబాట, పఠనోత్సవం కార్యక్రమాలు ప్రతి ఏడాది చేపడుతూ గత ఏడాది స్కూల్లో 42 మంది విద్యార్థులు ఉంటే ఈ ఏడాది స్కూల్లో 52 మంది పిల్లలు చేరి, చదవడం వెనుక ఆయన అవిరళ కృషి ఉంది. అందులో భాగంగానే 2017-18, 2021-22 అకాడమిక్ ఇయర్స్ లో మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మండల కేంద్రంలోని హైస్కూల్లో 2009 సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో 100% ఉత్తీర్ణత సాధించినందుకు గాను  అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఉషారాణి చేతులు మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఘనాపాటి ఈ గురువు. ఈయన వృత్తి పరంగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ శిక్షణా తరగతులకు జిల్లా రిసోర్స్ పర్సన్(డీఆర్ పీ)గా ఎఫ్.ఎల్.ఎం, త్రీ ఆర్.ఎస్ వంటి వాటిలో మండలంలోని ఉపాధ్యాయులకు శిక్షణలు ఇవ్వడంలో ఆయన శ్రద్ధ ఎనలేనిది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడిలో తాను విధులు నిర్వహిస్తున్న పాఠశాల ఎంపిక కావడంతో పై అధికారుల ఆదేశాలతో పాఠశాలకు అవసరమైన నూతన నిర్మాణాలు, మరమ్మతులు, మౌలిక సదుపాయాల దగ్గరుండి చేపించడంలో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి రిత్యా ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్ళపల్లి మండలంలో విధులు నిర్వహిండానికి అనాసక్తతో కొందరు టీచర్లు జిల్లా అధికారులకు తప్పుడు కారణాలు చూపుతూ వేరే జిల్లా, ఇతర పట్టణాలకు మండలాలకు బదిలీ, డిప్టేషన్ లు వేయించుకుంటున్న ప్రస్తుత రోజుల్లో అవకాశం ఉన్నా బదిలీల్లో ఇతర మండలాలకు ట్రాన్స్ఫర్ పై వెళ్లకుండా తన విద్యా, సామాజిక సేవలు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అంకితం అనే రీతిలో ఉంటున్న ఈ ఉపాధ్యాయుడికి రానున్న సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా సంబంధిత మండల విద్యాశాఖ అధికారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ భూక్య రమేష్ కు తగిన సన్మానం చేయాల్సిన అవసరంలో అతిశయోక్తి లేదు. కాగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ అధికారులు స్థితప్రజ్ఞుడు భూక్య రమేష్ సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.