నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గెజిటెడ్ హెడ్మాస్టర్ (జీహెచ్‌ఎం) పదోన్నతులను కల్పించాలని మల్టీజోన్-2 ఉపాధ్యాయుడు ఎండీ నజీముద్దీన్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మల్టీజోన్-1, మల్టీజోన్-2లో 324 జీహెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకు సంబంధించి జులై 31న సీనియార్టీ జాబితాను విద్యాశాఖ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఆగస్టు 20న మరోసారి జారీ చేసిందనీ, అదేనెల 23న వెబ్‌ఆప్షన్లను నమోదు ప్రారంభమవుతుందని ప్రకటించిందని వివరించారు. కానీ ఇప్పటి వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రారంభం కాలేదని తెలిపారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశారని పేర్కొన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని తెలిపారు.
మల్టీజోన్-1లో గతేడాది సెప్టెంబర్‌లో జీహెచ్‌ఎం పదోన్నతులను కల్పించారని వివరించారు. మల్టీజోన్-2లో కోర్టు కేసుల వల్ల ఈ ఏడాది జూన్‌లో పదోన్నతులిచ్చారని పేర్కొన్నారు.
మల్టీజోన్-1లో నాట్ విల్లింగ్ ఉపాధ్యాయులు ఆగస్టులో కోర్టును ఆశ్రయించారని తెలిపారు. వారికి అవకాశం కల్పించాలంటూ కోర్టు ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. 145 జీవో ప్రకారం పదోన్నతిని తిరస్కరించిన వారు ఏడాది వరకు పదోన్నతిని పొందలేరని వివరించారు. దీంతో రెండు జోన్లలో జీహెచ్‌ఎం పదోన్నతులను ప్రభుత్వం నిలిపేసిందని తెలిపారు. ప్రస్తుతం జీహెచ్‌ఎం పదోన్నతులను కల్పించడానికి ఎలాంటి అడ్డంకుల్లేవని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ చొరవ చూపి ఖాళీగా ఉన్న జీహెచ్‌ఎం పదోన్నతులను నింపాలని కోరారు.