ఫాతిమా ఐదో తరగతి చదువుతుంది. ఆదివారం సెలవు కావడంతో అమ్మతో కలిసి జూపార్కుకు వెళ్ళింది. అక్కడ రకరకాల పక్షులను, జంతువులను చూసి చాలా సంతోషించింది. వాటి దగ్గరికి వెళ్లి వాటిని పట్టుకోపోతుంటే ”జంతువులకు దూరంగా ఉండు నాన్న.. దగ్గరికి వెళ్తే ప్రమాదం” అని వాళ్ల అమ్మ చెప్పింది. అయినా ఫాతిమా అవేమీ పట్టించుకోలేదు. ఆనందంతో పార్క్ అంతా పరుగులు పెడుతూనే ఉంది. తనను ఆపడం ఆ తల్లి తరం కాలేదు.
ఫాతిమా పార్కుకు వెళ్లేటప్పుడు క్యారెట్ ముక్కలను, చిలగడ దుంపలను క్యారేజీలో తనతో పాటు తీసుకెళ్లింది. కుందేలు ఉండే చోటుకు వెళ్లి వాటికి ఆ క్యారెట్ ముక్కలను అందించింది. అక్కడ ముద్దుగా ఉన్న ఒక కుక్క పిల్లను చూసింది. ”’అబ్బా! ఎంత బాగుందో!” అనుకుంటూ దగ్గరికి వెళ్లింది. ఫాతిమాను చూడగానే ఆ కుక్కపిల్ల పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చింది. తన చేతుల్లోకి తీసుకొని సంబరపడింది.
”అమ్మా! ఈ కుక్కపిల్ల నాకు బాగా నచ్చింది. మనం ఇంటికి తీసుకెళ్దాం” అని తల్లితో అన్నది.
తల్లి కూడా లేకపోవడంతో ఫాతిమా ఆ కుక్క పిల్లను ఇంటికి తీసుకొని వెళ్లింది. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత దానితోనే గడిపేది. మొదటి రెండు రోజులు కుక్కపిల్ల హుషారుగా ఉన్నది. కానీ ఆ తర్వాత అది విచారంగా ఉండటం చూసి ఫాతిమా కూడా బాధపడింది.
”అమ్మా! ఎందుకు ఈ కుక్క పిల్ల ఇలా ఉన్నది” అని అడిగింది.
”దానికి తన తల్లి గుర్తుకొచ్చిందేమో… అక్కడ కూడా తల్లి కూడా బిడ్డ కోసం వెతుకుతున్నట్టు ఉన్నది. అందుకే ఇది ఇంత విచారంగా ఉన్నది” అని చెప్పింది తల్లి.
మరుసటి ఆదివారం కుక్కపిల్లను జూపార్కుకు తీసుకొని వెళ్లింది. దూరంగా తల్లి కుక్క చూసి బిడ్డ దగ్గరికి వచ్చింది. కుక్కపిల్ల తల్లి దగ్గరికి వెళ్లి సంతోషంగా ఎగిరి గంతులు వేసింది.
ప్రతి ఆదివారం జూపార్కుకు వెళ్లి కుక్కపిల్లతో కాసేపు గడిపేది. మిగతా పక్షులకు, జంతువులకు కూడా ఆహార పదార్థాలను పెట్టేది. కుక్కపిల్లకు, ఫాతిమాకు గాఢమైన స్నేహం ఏర్పడింది. ఫాతిమా మంచి మనసుకు తల్లి ఎంతో మురిసిపోయింది.
– బానోతు సాయిశ్రీ,
10 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కోదాడ సూర్యాపేట జిల్లా, తెలంగాణ