తెలుగుకు వెలుగులద్దిన గిడుగు

Gidugu, who gave light to Teluguమనుషులు కదిలితే సమాజం. కవులు కదిలితే సాహిత్యం. శక్తివంతమైన తెలుగు సాహిత్యాన్ని చెక్కు చెదరకుండా గొడుగై రక్షణ కవచంలా నిలిచి గ్రాంథిక భాష పేరుతో కొందరికే పరిమితం చేసే వారి పాలిటి పిడుగై ఆ ప్రమాదం నుంచి తెలుగు భాష పరిరక్షణ వ్యాప్తికి విశేషమైన కషిని చేసిన మహనీయుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు.
గిడుగు రామమూర్తి పంతులు వాడుకభాష ఉద్యమ పితామహుడు. వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషావేత్త. చరిత్రకారుడు. సంఘ సంస్కర్త. హేతువాది.
గిడుగు రామమూర్తి 1863 వ సంవత్సరం ఆగస్టు 29 న శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. తల్లి వెంకమ్మ. తండ్రి వీర్రాజు. చిన్నతనం నుంచి తెలుగు భాష పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్న గిడుగు రామమూర్తి ఎనిమిదవయేటనే శబ్దమంజరిని నేర్చుకున్న ఏకసంథాగ్రాహి. తన పద్నాలుగవయేట తండ్రిని కోల్పోయి విజయనగరంలోని మేనమామ గారింట ఉండి మెట్రిక్‌ చదివి పాసయినారు. రాజాగారి పాఠశాలలో 1880 నుంచి విద్యార్థులకు చరిత్రను బోధించారు. ముఖ లింగ క్షేత్రంలో శాసనలిపిని నేర్చుకొని అనేక చారిత్రక వ్యాసాలను రచించారు.
ఇండియన్‌ యాంటిక్వరి, మద్రాస్‌ లిటరేచర్‌ అండ్‌ సైన్స్‌ జర్నల్స్‌లో వీరి వ్యాసాలు ప్రచురించబడ్డాయి. డిగ్రీ పూర్తి చేసి లెక్చరర్‌ గా పర్లాకిమిడిలో 30 సంవత్సరాలు పనిచేసారు.
1911లో స్వచ్ఛంద పదవీవిరమణ చేసారు. 1940 జనవరి 22న మరణించారు. 48 సంవత్సరాల జీవన కాలంలో అవిశ్రాంత జీవన పయనం వ్యక్తిగా, భాషావేత్తగా వీరిని మహోన్నత వ్యక్తిగా చిరస్థాయిగా నిలబెట్టాయి.
గిడుగు రామమూర్తి పంతులు ఉద్యోగం చేస్తూ చుట్టుపక్కల సవరలను గమనించి వారితో మాట్లాడలేని దశలో వ్యవహర్తను ఇంటికి పిలిపించి సవరభాషలో పుస్తకాలు రచించి వారికి చదువునేర్పే ప్రయత్నం చేసారు. ఒక సంఘ సంస్కర్తగా సవరల జీవితాలను బాగుచేయాలనే సంకల్పంతో వారికి చదువు నేర్పించడం మొదటిపనైతే ఆ ప్రయత్నంతో సవర విద్యార్థులకు తన ఇంట్లో బస కల్పించి వారికి భోజనం పెట్టి, వారికి మార్గదర్శకత్వం వహిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు గిడుగు రామమూర్తి. వీరి సేవలను మద్రాస్‌ ప్రభుత్వం గుర్తించి 1913 లో ‘రావ్‌ బహద్దూర్‌’ బిరుదు ప్రదానం చేసింది. సవర భాషా వ్యాకరణాన్ని రూపొందించి 1931 లో, సవర -ఇంగ్లీషు కోశాన్ని 1938 లో అచ్చు వేసారు. 1934 లో ‘కైజర్‌ -ఇ – హింద్‌’ బిరుదు కూడా వీరిని వరించింది. 1938 లో ‘కళాప్రపూర్ణ బిరుదు’ ను పొందారు. వ్యవహారిక భాష కోసం దాదాపు 30 సంవత్సరాలకు పైగా విశేష కృషి చేశారు. శాసన లిపిని నేర్చుకుని చారిత్రక వ్యాసాలు రచించడం ఒక విశేషమైతే 1919 లో ‘తెలుగు’ అనే మాస మాసపత్రికను స్థాపించి అనేక వ్యాసాలను రచించారు. డా||శరత్‌ జ్యోత్స్నారాణి గిడుగు రామమూర్తి తెలుగు పత్రిక ద్వారా చేసిన సేవలను వివరిస్తూ తెలుగు పత్రిక సంపాదకీయంలోని గిడుగు రామమూర్తి తెలుగు భాష వర్ధమాన స్థితిగతులను గూర్చి బాధపడుతూ ఆడవాళ్ళు చదువుకోవడానికి, పిల్లలు చదివి ఆనందించడానికి వివిధ స్థాయి పాఠకులు చదివి లోకవృత్తం తెలుసుకోవడానికి తగిన రచనలు తెలుగులో వెలువడడానికి కారణం తెలుగు వచన రచనను అనావశ్యకమైన నియమ నిబంధనలు బాధించడమే అంటారు. ఏ భాష అయినా ఆ కాలపు విజ్ఞాన వ్యాప్తిపైనే ఆధారపడి ఉంటుందని జన సామాన్యంలో విద్యనూ విజ్ఞానాన్ని వ్యాపింపజేయాలంటే వాజ్మయాన్ని మించిన సాధనం మరొక్కటి లేదని పదే పదే బోధించేవారు గిడుగు రామమూర్తి. ఆయన నడిపిన తెలుగు పత్రిక ఆ రోజుల్లో గొప్ప పత్రికగా వెలుగొందింది. ఈనాటికీ ఏనాటికీ ఆ పత్రికను తెలుగు ప్రజలు మరిచిపోలేరు అన్నారు.
1919 లో వర్థమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం స్థాపించగా ఈ సమాజానికి గిడుగు కార్యదర్శిగా కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా కొనసాగారు. తెలుగు -సవర నిఘంటువు, ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము, గద్య చింతామణి, వ్యాస కవి శరణ్యము, వ్యాస సంగ్రహము వంటి పలు రచనలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. 1933లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవం సందర్భంగా తెలికచర్ల వెంకటరత్నం సంపాదకత్వంలో 46 పరిశోధక వ్యాసాలతో Missellany of Essays అనే గ్రంథం గిడుగురామమూర్తి పంతులుకి బహుమానంగా ఇచ్చారు. ఈ సందర్భంగా తెలికచర్ల వెంకటరత్నం ”వారిది ఉదార హృదయమే. ప్రజాసేవ లోకకళ్యాణము వారి ఆశయములు. వారు పూనుకున్న కార్యాలన్నింటికీ ఇదే మూల సూత్రం” అన్నారు.
తెలుగు కళాసమితి మస్కట్‌ తెలుగును వాడుక భాషగా తయారు చేసిన గిడుగు రామమూర్తి శ్లాఘనీయులు అని కొనియాడింది.
1907 లో జె.ఏ. యేట్స్‌ అనే ఇంగ్లీషుదొర వ్యవహార భాషకు పుస్తక భాషకు మధ్యగల తేడాని ప్రశ్నించారు. దీనికి యేట్స్‌ విశాఖపట్నం లోని ఎ.వి.ఎన్‌. కళాశాల పి.టి. శ్రీనివాస్‌ అయ్యంగార్‌ని అడుగగా దీనికి సమాధానం చెప్పగలవారు గురజాడ గిడుగు గార్లన్నారు. దీనిని బట్టి గిడుగు ప్రత్యేకత మనకు తెలుస్తుంది.
గురజాడ, గిడుగు రామమూర్తి పంతులు, శ్రీనివాస్‌ అయ్యంగార్‌, యేట్స్‌ దొరల సమాలోచనలో వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైందన్నారు భాషావేత్త శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి.
సమాజంలో అన్ని రంగాల్లో, ప్రాంతాల్లో వస్తున్న మార్పులు అనుసంధానాలు అమలవుతున్న దశలో ప్రాచీన కావ్య భాష నేర్పడం వల్ల నిత్య వ్యవహారానికి ఉపయోగపడటం లేదనేది గిడుగు వాదన. ఆధునిక విద్యా విధాన బోధన పద్ధతులు భాషాగ్రహణ శక్తికి ఉపకరిస్తాయి. చదువుకోవడానికి రాయడానికి అపరిమిత ఉపకరణాలు అందుబాటులో ఉన్న కారణంగా జ్ఞాపక సంప్రదాయంపై ఆధారపడి ఉన్నారనే సమర్థించుకుంటున్నారని వాదించారు.
”చదవడం కేవలం విద్యను నేర్పడానికి వినియోగించిన మొత్తం సమయాన్ని వస్తువులను పరిశీలించి తెలుసుకోగల సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అతడి వాస్తవిక విజ్ఞానాన్ని విస్తరించడానికి వినియోగించినట్లయితే, సంభాషణల ద్వారా తెలియజేసినట్లయితే తానిప్పటికే తెలుసుకోగలిగిన దానికన్నా ఎన్నో విషయాలను సంవత్సర కాలంలో విద్యార్థి నేర్చుకోగలడు. జ్ఞానం సామాన్య ప్రజల కోసం అయినప్పుడు అర్థం కాని భాషలో ఎందుకు రాయడం నేర్పడం? అని ప్రశ్నించాడు.
ఆ కాలంలో కొందరు కవులు రాజుల మెప్పు కోసం స్త్రీల అంగాంగాలను వర్ణిస్తూ చవకబారు రచనలు చేసారని, విద్యార్థులు చదివించే పుస్తకాలలో అశ్లీల భాగాలని పరిహరించాలని వాదించిన గొప్ప వ్యక్తి గిడుగు రామమూర్తి.
వ్యాకరణం అనే భావానికి అర్థం మారుతోందని, ఆధునికుల దృష్టిలో వ్యాకరణ భాషను అనుసరించేదని గిడుగు రామమూర్తి పాశ్చాత్య ప్రభావం వల్లే రాసారని తెలుస్తుంది.
గిడుగు వ్యాకరణం పట్ల పెట్టిన దృష్టిని గమనించి ”మనదైన రీతిలో కాకుండా తెలుగును భాషా దృక్పథంతో భాషలోని వర్ణ నిర్మాణం, రూప నిర్మాణం, సంధి స్వరూపం, సమాసగతి, వాక్య నిర్మాణ రీతి మొదలైన వాటిని అధ్యయనం చేస్తూ ఆయా కాలాల్లోని రచనల నుండి నేటి వరకూ ఉన్న జీవద్భాషా స్వరూపాన్ని వర్ణనాత్మక వ్యాకరణ దృష్టితో పరిశీలించి తెలుగు భాషా స్వరూప విస్తృతిని అటు నిఘంటువుల రూపంలో గాని, వ్యాకరణ గ్రంథాల రూపంలో గాని వెలుగులోకి తీసుకు రావాలి. అది గిడుగుకు తెలుగు వారు అర్పించే నివాళి అన్న భావాన్ని డా|| డి. విజయలక్ష్మి.
గిడుగు రామమూర్తి ఏది చేసినా సహేతుకంగా చేయడానికి ఇష్టపడతారు. గట్టి గొంతుకతో పుంఖాను పుంఖాలుగా ఉదాహరణలిస్తూ మాట్లాడగలగడం వారి సొంతం. గ్రాంథిక వాదాన్ని చితకగొడుతూ వ్యవహారికాన్ని సమర్థించడం వల్ల పండిత లోకంలో అసామాన్యమైన పేరు వచ్చింది.
గిడుగు రామమూర్తి 25 సంవత్సరాలు ఊరూరా తిరిగి వ్యవహారిక భాష గురించి మాట్లాడి తన అభిప్రాయాల్ని ఒప్పుకున్న వారి సంతకాలు సేకరించి, ఒప్పుకోని వారి సంతకాలు కూడా సేకరించేవారు.
తెలుగు చదువుకున్నా సైన్స్‌ వలె ఎనాలసిస్‌ చేసినట్లుగా ఎక్స్పరిమెంట్‌, అబ్జర్వేషన్‌, ఇంప్రెషన్స్‌ రాసి ఆధారాలు ఎలా చూపిస్తామో అలాగే తెలుగులో కూడా చేయాలంటారు గిడుగు.
”ఏ భాషావేత్త అయినా మౌలికంగా పరిశోధన చేస్తే ఎక్కువ రాయలేడు. కాని ఆయన చేసిన పరిశోధన మాత్రం జాతికి ఒక దీపం లాగా, దీప స్థంభం లాగా తెలుస్తుంది. అలాంటి మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు అని డా||ఎల్లూరి శివారెడ్డి ముఖ్య అతిథి ప్రసంగంలో గిడుగు రామమూర్తి 150 వ సదస్సును యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 2013లో నిర్వహించిన సందర్భంలో అన్నారు.
ధ్వనిని ప్రస్తావిస్తూA manual of Sosa Language (1931) అనే వర్ణనాత్మక వ్యాకరణంలో సవర భాషలోని ధ్వనులు, సంధులు, సమాసాలు, వాక్యాలను, భాషాశాస్త్ర పద్ధతిలో విశ్లేషించడం ధ్వని పదనిర్మాణం, మాండలిక శాస్త్రం, సామాజిక భాషా శాస్త్రం, చారిత్రక భాషా శాస్త్రం, తులనాత్మక భాషా శాస్త్రం, నిఘంటు నిర్మాణం, వ్యాకరణాలతో గిడుగు కృషిని వివరించారు. డా|| భుజంగరెడ్డి భాషావేత్తగా గిడుగును అభివర్ణిస్తూ అన్నారు.
డా||దార్ల వెంకటేశ్వరరావు గిడుగు రామమూర్తి భాష సామాజిక దృక్పథం అనే అంశం పై పత్ర సమర్పణ చేసి గిడుగురాసిన వ్యాసాలను ప్రస్తావించారు. ‘మరోసారి గిడుగు రామమూర్తి’ – చేకూరి రామారావు, నడుపల్లి శ్రీరామరాజు కలిసి చేసిన పుస్తకంలో గిడుగు గురించి అనేక విషయాలు మనకు అవగతమవుతాయని వివరించారు. చివరిగా ”తెలుగు సవరల భాషల మీద ఆయన చేసిన అద్భుతమైన పరిశోధన కంటే, వారు చేసిన శాసన పరిశోధనల కంటే, వాడుక భాషా వ్యాప్తికి వారు చేసిన కృషి కంటే వారి వ్యక్తిత్వం గొప్పది” అన్న నడుపల్లి శ్రీ రామరాజు అభిప్రాయం అందరూ ఆమోదించదగినది.
ఇదే అభిప్రాయాన్ని ”వారి తెలివి, పట్టుదల, ఓర్పు, నేర్పు, ఔదార్యం, పాండిత్యం, సమయస్పూర్తి ఇత్యాదులు అద్భుతం. వాటిని మించినది వారి నిష్కల్మష హదయం” శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు వ్యక్త పరిచారు.
గిడుగు రామమూర్తిని వివిధ కవులు వ్యక్త పరిచిన అభిప్రాయాలను అచ్చంగా తెలుగు వెబ్‌ సైట్‌ లో ”తెలుగు సరస్వతి నోముల పంట వ్యావహారిక భాషా పితామహుడు గిడుగురామమూర్తి (1863-1940)” అనే వ్యాసంలో కొంపెల్ల శర్మ సేకరించారు. వాటిలో కొన్ని :
గిడుగు పిడుగు – చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
మహాప్రస్థానం గీతాలకు కారణం ఎవరంటే భాషకు సంబంధించినంతవరకు గిడుగు వారే- శ్రీ శ్రీ యుగపురుషుడు – శ్రీ పాద సుబ్రహ్మణ్యం
»»Let him believe a cause to be just and true and he would give himself body and soul to it..carelessness of personal gain , rather welcoming loss for its sakeµµ – J.A.Yates .
.
ఇటువంటి ప్రముఖుల అభిప్రాయాలు ప్రతి రచయిత గిడుగు గురించి ప్రస్తావించకుండా ఉండరనేది వాస్తవం.
సరసభారతి ఉయ్యూరు నుంచి జి. దుర్గాప్రసాద్‌ ”వ్యవహార భాషోద్యమ సారధి గిడుగు” అని అభివర్ణించారు.
ఆంధ్రజ్యోతిలో శ్రీ అల్లం సెట్టి చంద్రశేఖరరావు ”గురువుగా గిడుగు” అనే రచనను చేసారు. పలు విశ్వ విద్యాలయాలు సాహితీసంస్థలు గిడుగు రామమూర్తి పేరున సభలు సదస్సులు అనేకం నిర్వహించారు.
వీటన్నింటి ద్వారా గిడుగు రామమూర్తి తాను భాషాపరంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అవగాహనతో అందరూ అన్ని రకాలుగా అభివృద్ది చెందడానికి గ్రాంథిక భాష అడ్డుగా నిలవకూడదని, వ్యవహార భాష ప్రజలను సాహిత్యానికి, భాషకు మరింత చేరువ చేస్తుందని ప్రగాఢంగా విశ్వసించి ఆ దిశలో అధ్యయనం చేసి, ఆధారాలు సేకరించి వివిధ పరిశోధనా వ్యాసాలు రచించి సభలు సమావేశాలలో తాను చూసినవి గమనించనవి భాషా పరమైన భేదాలను ఉదాహరణలతో సహా చూపించి, ఆ విషయమై అభ్యంతరాలను వ్యక్తపరచిన వారితో వాదించి తగిన వివరాలను సేకరించి, సహేతుకంగా చూపించి అందరినీ ఒప్పించిగల నైపుణ్యతను కలిగిన వాడని పలువురి చేత అనిపించుకోవడం మాత్రమే కాదు. విశేషమైన కృషి చేసి పలు పరిశోధన వ్యాసాలు రాయడం, ‘పత్రిక’ కోసం పనిచేయడం, సవరల కోసం చేసిన కృషి వీటన్నింటి ద్వారా ‘రామ మూర్తి పంతులు తెలుగు సంస్కృతి నోముల పంట’ అని విశ్వనాథ సత్యనారాయణతో కీర్తింపబడ్డ మహామనీషిగా చరిత్రలో నిలిచిపోయారు.
తెలుగు భాషకు కృషి చేసిన నిత్య కృషీవలుడుగా గిడుగువెంకట రామమూర్తి పంచిన తెలుగు వెలుగులను ప్రసరింపజేస్తూ విశ్వజనీనమైన విలువైన తెలుగు భాషను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిమీద ఉంది. ఈ దిశలో సేవలందించిన గిడుగురామమూర్తి పంతులుకు తెలుగు వారందరూ రుణపడి ఉన్నారు.

– డా||సమ్మెట విజయ, 9989820215