భాష క్రమానుగతంగా మానవజాతి పెంపొందించుకున్న శక్తివంతమైన భావ ప్రసార సాధనం. ఆలోచనల ఉత్పత్తి కేంద్రం. సష్టిలోని జీవరాశులన్నింటిలోనూ మనిషిని ఉన్నతుడిగా, ప్రజ్ఞావంతుడుగా నిలబెట్టగలిగిన అంశాలలో భాష కీలకమైనది. భావానికి ప్రతిరూపమైన భాష మానవజాతి అభ్యున్నతికి, గొప్పతనానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక సమాజపు సంస్కతి, నాగరికతలు తెలుసుకోవడానికి, వారసత్వంగా తరతరాలకు అందించడంలోనూ భాష ప్రధాన భూమిక అవుతుంది. తద్వారా సమాజ వికాసంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.
భాష ్యక్తి మూర్తిమత్వానికి ప్రతిబింబం. అది సామాజికంగా వ్యక్తిని బాల్య దశ నుండి రూపుదిద్దుతుంది. అటువంటి భాషలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని వినడానికి సొంపైనవిగా, శ్రావ్యమైనవిగా ప్రసిద్ధిగాంచాయి. ఈక్రమంలో ఆసియా ఖండంలో ఫార్సీ భాష, ఐరోపా ఖండంలో ఇటాలియన్ శ్రావ్యమైన భాషలుగా గణుతికెక్కాయి. ఇదే పరంపరలో మన మాతభాష తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఖండపు ఇటలీ భాష) అని ప్రఖ్యాతిగాంచినది. అమ్మ ఒడిలా చల్లనైనది, తేనెకంటే తీయనిదైన మన తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 29న జరుపుకోవడం ఆనవాయితీ. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగుకు పట్టం కడుతున్న రోజుల్లో ప్రజల వాడుక భాష ప్రాధాన్యతను గుర్తించి, వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడుగా నిలిచిన గిడుగు వెంకటరామమూర్తి భాషా సేవను స్మరిస్తూ ఆయన జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు.
గిడుగు వెంకట రామమూర్తి పంతులు అమ్మ భాషను ప్రేమించి, అభిమానించే, గౌరవించే ప్రతి ఒక్కరికీ సుపరిచితులు. ఆయన భాషా చైతన్య బావుటా. ఉపాధ్యాయుడిగా వారి అడుగులు భావితరానికి అడుగుజాడలు. ప్రజల వాడుక భాషకు విలువ పెంచిన ఆయన తెలుగు వెలుగు. సంఘం వద్ధిలోకి రావాలంటే ప్రజల్లో విద్య వ్యాపించాలని, ఆ విద్య సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే అది వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఉండాలనీ, ప్రజలు తమ భాషలో రాయడానికీ చదవడానికీ సమర్థులై ఉండాలనీ, అందుకు అనుకూలమైన సాహిత్యం వెలువడాలనే ప్రజాస్వామిక దక్పథంతో వాడుక భాషోద్యమం ప్రారంభమైందని చాటి, జీవితాన్ని భాషాసేవకు ధారాదత్తం చేసిన సంస్కరణాభిలాషి. సామాన్యుడికి సైతం తెలుగు సాహిత్యం చేరువవడానికి, ప్రజల భాషలో సాహిత్య సజనకు మార్గం సుగమం అయ్యేందుకు కషిచేసిన శ్రామిక ప్రతిబింబం.
క్రీస్తు శకం ఆరంభం నాటికే తెలుగు భాష ప్రజల వ్యవహారంలో మౌఖిక రూపంలో ఉండేది. క్రమేణా 11వ శతాబ్దం నాటికి కావ్య భాషగా రూపొందింది. 11వ శతాబ్దం నుండి దాదాపుగా 19వ శతాబ్దం వరకు వెలువడిన తెలుగు రచనలన్నీ అనేక నియమ నిబంధనలకు లోబడి, వ్యాకరణ సూత్రాల ఆధారంగా రాయబడినట్లుగా గమనించవచ్చు. ఈ విధంగా నిర్దిష్టమైన సాహిత్య ప్రమాణాలకు కట్టుబడినదే గ్రాంథిక భాష అని భాషావేత్తల అభిప్రాయం. ఎక్కువగా సంస్కత పదాలను వాడడం, దీర్ఘ సమాసాలు, అలంకార ప్రయోగం మొదలైనవన్ని గ్రాంథిక భాష లక్షణాలు. 19వ శతాబ్దం పూర్వం వరకు కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే విద్యా అవకాశాలు ఉండేవి. అందువల్ల గ్రాంథిక భాష వారివరకే పరిమితమైంది. ప్రాచీన కాలంలోని గురుకులాలు, బ్రిటీష్ పరిపాలనా కాలం వరకు గ్రాంథిక భాషే విద్యాబోధనలో కూడా ఉపయోగించబడేది. అదే ప్రామాణిక భాషగా చలామణి అయ్యేది. ఆ రోజుల్లో సామాన్య ప్రజలు మాట్లాడే భాషను పామర భాషగా భావించేవారు. అందువల్ల ఉన్నత వర్గాల వాళ్ళు తప్ప మిగతా సామాన్య ప్రజల అభివద్ధి శూన్యమని చెప్పాలి.
భాష సామూహికం, సామాజికం. భాషా నైపుణ్య అభివద్ధి వ్యక్తి అభివద్ధికి బాటలు వేస్తుంది. సమాజంలోని ప్రజలు తమ నిత్య వ్యవహారాలలో ఉపయోగించే భాషకు పండితులు, కవులు తమ తమ రచనలలో ఉపయోగించే భాష భిన్నంగా ఉండడం, విద్యార్థులు తమ నిత్యజీవితంలో వాడే భాషకు విద్యాలయాలలోని భాషకు ఏమాత్రం పోలిక లేకపోవడం తదితరాల వల్ల గ్రాంథిక భాషా ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గిడుగు రామమూర్తి పంతులు, యేట్స్, శ్రీనివాస అయ్యంగార్ వంటి ఎందరో విజ్ఞులు సమాజంలోని ప్రజల అభివద్ధికి వ్యవహారిక భాష ముఖ్యమని భావించారు.
భాష నిరంతర ప్రవాహి. మార్పు భాషకి గల సహజ గుణం. ప్రధానంగా గిడుగు రామమూర్తి ప్రజల వ్యవహారిక భాష బోధనా మాధ్యమంగా ఉండాలని వాదించారు. 1910 నుండి ఆయన తుది శ్వాస వరకు విశేషమైన భాషా సేవను కొనసాగించారు. శిష్ట వ్యవహారిక భాషగా గిడుగు, గురజాడలు పేర్కొన్న భాషని గ్రామ్యమని నిందించిన పండితులూ లేకపోలేదు. వ్యవహారిక భాషా ఉద్యమం, స్వాతంత్రోద్యమం సమకాలికంగా జరుగుతున్న రోజులు కూడా అవి. అందువల్ల ప్రజలు మాట్లాడే భాషలో సాహిత్య రచన స్వాతంత్రోద్యమానికి కూడా సహాయం చేయగలుగుతుందని ఆనాటి కొందరు కవులు, రచయితలు గ్రహించారు. ప్రజలలో ైతన్యం కలిగించడానికి వ్యవహారిక భాష తోడ్పడుతుందని భావించి వాడుక భాషలో రచనలు చేశారు. అయితే వాడుక భాష ఉద్యమ లక్ష్యం శిష్ట వ్యావహారిక భాష. పాత్రోచిత భాషగా కింది తరగతి వారి భాషకు సాహిత్యంలో స్థానం లభించింది తప్ప ఆ భాషలో సాహిత్య సజనల మాట ప్రశ్నార్ధకమే.
గిడుగు రామమూర్తి వంటి మహనీయుల కషి మూలంగా ఏ కొద్దిమందికో అందిన విద్య వ్యవహారిక రూపంలోకి మారి అందరికీ అందుబాటులోకి వచ్చింది. సాహితీ సజనలు, కలం శక్తి ఉన్న ఎందరికో సాధ్యమయ్యాయి. అయితే ఇదంతా మూన్నాళ్ళ ముచ్చటవుతుందా అన్న అభద్రత లేకపోలేదు. తెలుగును అధికార భాషగా, మాధ్యమ భాషగా, సాహిత్య భాషగా అభివద్ధి చేసే దిశలో వివిధ అకాడమీలు ఏర్పాటయ్యాయి. ఎవరి కషి వారు నిర్వహిస్తున్నన్నప్పటికీ ఆంగ్లమే అన్ని వ్యవహారాలను శాసిస్తోంది. పట్టపురాణిగా వెలుగొందుతోంది. బాహాటంగా ఒప్పుకోకపోయినా ప్రతి తెలుగు మనసులోని భావన ఇదే. అన్ని భాషలు నేర్చినా మాతభాషని మరవకూడదని చెప్పుకుంటున్నామే తప్ప అసలు మాతభాషని మరచిపోవలసిన అగత్యం ఏమిటని ఆలోచిస్తున్నామా? పెద్దల నుండి పిల్లల వరకు ఇంగ్లీషుపై మోజు పెరిగిందనే మాట వాస్తవం. మాతభాషలో మాట్లాడడం, బోధనా మాధ్యమంగా ఎంచుకోవడం, అధికారిక కార్యకలాపాలకు సరిపోదనే చిన్న చూపు చెప్పుకుంటూపోతే అనేకానేకాలుగా అమ్మ భాషను అవహేళన చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తు కాలంలో తెలుగు భాషా పదాలను వెతుక్కోవడం తప్పదనిపిస్తోంది. మాతభాషను పరభాష వెంటాడుతున్న సందర్భం ఒకవైపు, ఏ తెలుగు? ఎక్కడి తెలుగు? అనే సమస్య మరోవైపు తెలుగు భాష మనుగడను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నింటి మధ్య ఒక ఆశా దీపం మాత్రం మిగిలే ఉందనిపిస్తోంది. ఇక్కడ నా అనుభవంలోని ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఉంది. ఇటీవల ఒక సోదర ఆంగ్ల ఉపాధ్యాయుడు తెలుగులో కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. ఆయన రాసినది బాగుందా అని నా అభిప్రాయ సేకరణ చేసే సందర్భంలో నేను ”మీరు ఆంగ్లోపాధ్యాయులు కదా! మన ప్రాంతం నుండి ఆంగ్ల రచనలు మీ నుండి ఆశించాలనిపిస్తుంది” అన్నాను. దానికతను నేను ఇంగ్లీషు చెప్పే టీచర్ నైనప్పటికీ మాతభాష అయిన తెలుగులో రచన చేస్తేనే మనసుకు తప్తిగా అనిపిస్తుందన్నాడు. ఇదే మాదిరి ఆలోచనా దక్పథం, మాతభాషాభిమానం భావితరంలోనూ అంతరంతరాళలో తప్పకుండా ఉండే ఉంటుంది. దానిని జాగతం చేయడమే పెద్దల పని.
వ్యవహారిక భాషా ఉద్యమ ప్రభావం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసోయి, సాధన తద్వారా విశేషమైన సాహితీ సంపద సష్టి జరుగుతుంది. ఇది సంతోషించదగిన, ఆహ్వానించదగిన పరిణామం. తెలంగాణ వాసులు మాట్లాడేదైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడేదైనా తెలుగే. రాజకీయ, వర్గ ఇతర వ్యత్యాసాలను పక్కకు పెడితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నిత్య వ్యవహార భాష తెలుగు. కాకపోతే ఆయా ప్రాంత ప్రజల జీవన విధానాన్ని బట్టి వారు సంభాషించే తెలుగు భాషలోని నుడికారం, పలుకుబడులలో విభిన్నత గోచరిస్తుంది. సాహిత్య సజనల్లోనూ ప్రాంతీయ భాషా మమకారం కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వంగా సంచరించే భారతదేశంలో చిన్న చిన్న భాషావ్యత్యాసాలు ఉన్నప్పటికీ అందరిదీ తెలుగే. ప్రత్యేకించి సాహిత్య పరంగా ”ప్రజల అండా ఆధారమూ కోల్పోయినందువల్ల సాహిత్య భాష తన జీవశక్తిని కోల్పోయింది. ఎందువల్లనంటే, మొత్తం సమాజ నానావిధావసరాలను తీర్చుతూ, వాటి మార్పులకు అనుగుణంగా తన ప్రతి అంగాన్ని మలచుకోలేని భాష ఏదీ సజీవంగా వుండజాలద” ని గురజాడ అసమ్మతి పత్రంలో అన్న మాటలు ఆచరణీయం. అయితే ”సాహిత్య రూపాలు గానీ, ప్రమాణాలు గాని, ఆశయాలు గాని కాలానుగుణంగా మారుతూ వచ్చినట్టే సాహిత్యానికి సంబంధించిన సమస్యలు కూడా మారుతూ వస్తాయి. ప్రజల భాష, ప్రజల సాహిత్యం అనేది ఈ కాలపు సమస్య” అన్న కొడవటిగంటి కుటుంబరావు మాటలు ప్రస్తుత తెలుగు సమాజం ముందున్న సవాలు. తెలంగాణీయులు 33 జిల్లాల యాసలతో సాహిత్య సజనలు చేసినా, ఆంధ్రీయులు కోస్తా, రాయలసీమ వారి వారి భాషలో రచనలు చేసినా తెలుగు భాష అస్తిత్వాన్ని పరిరక్షించడమే అవుతుంది. కాకపోతే అంతర్జాతీయ వేదికపై తెలుగు వెలగడం అందరి లక్ష్యం అయినప్పుడు ఒక గిడుగు, ఓ కాళోజీ, ఓ గురజాడల కషి సార్ధకమనిపిస్తుంది.
ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ రచయితలు, కవులు కాని ప్రత్యేకించి సంపాదక వర్గం కానీ తెలుగుభాషలోని వైవిధ్యత ఆధారంగా ప్రత్యేక సంకలనాలు, పారిభాషిక పదకోశాల కషి సల్పవలసిన అవసరం ఉంది. పాఠ్యపుస్తకాల ద్వారా తెలుగు అభివద్ధికి ప్రమాణాలను మరింతగా మెరుగుపరచాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాలలో మాట్లాడే మన అమ్మభాషను పరస్పరం ప్రేమిస్తూ, గౌరవించుకుంటూ, అభివద్ధి మార్గంలో నడిపిద్దాం. తెలుగు భాషా దినోత్సవాలను ప్రతిరోజూ జరుపుకుందాం.
– డా. ఉప్పల పద్మ, 9959126682