– వార్మప్ మ్యాచ్‌లో భారత్ గెలుపు
కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా) : ఏకైక పింక్ బాల్ వార్మప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మెరుగైన ప్రదర్శన చేసింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దు కావటంతో.. రెండో రోజు ఇరు జట్లు 46 ఓవర్ల చొప్పున ఆడాయి. భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (50, 62 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45, 59 బంతుల్లో 9 ఫోర్లు) తనదైన శైలిలో రాణించాడు. యువ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (42, 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (42 నాటౌట్, 36 బంతుల్లో 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. రవీంద్ర జడేజా (27, 31 బంతుల్లో 3 ఫోర్లు) సైతం మెప్పించాడు. సమిష్టిగా రాణించటంతో 46 ఓవర్లలో భారత్ 257/4 పరుగులు చేసింది. ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ పీఎం ఎలెవన్‌పై సాధికారిక విజయం సాధించింది. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (27) ఓపెనింగ్ జోడీ వార్మప్‌లో కొనసాగింది. రోహిత్ శర్మ (3) మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చినా.. పెద్దగా పరుగులు చేయలేదు. విరాట్ కోహ్లికి విశ్రాంతి లభించింది.
తొలుత ఆసీసీ పీఎం ఎలెవన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ శామ్ (107, 97 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించగా.. టెయిలెండర్ హన్నో జాకబ్స్ (61, 60 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాక్ క్లైటన్ (40, 52 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. భారత యువ పేసర్ హర్షిత్ రానా (4/44) నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా వార్మప్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడిలైడ్‌లో ఈ నెల 6 నుంచి ఆరంభం కానుంది.