బాలసదన్‌లో బాలికపై లైంగికదాడి

– ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-భువనగిరి
అనాథలకు రక్షణ కల్పించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖలోనే బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో వెలుగుచూసింది. ఈ నెల 14న ఒక కార్యక్రమం నిర్వహణ పేరుతో డీసీపీఓతోపాటు మరి కొంతమంది రాత్రి 7 గంటల సమయంలో బాలసదన్‌కు వచ్చారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ బాలిక బాత్రూంకు వెళ్లి వస్తుండగా.. ఓ వ్యక్తి లైంగికదాడి చేశాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలిక ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది. గమనించిన బాలసదన్‌ సిబ్బంది ఆరా తీయగా ఓ వ్యక్తి తనపై లైంగికదాడి చేశాడంటూ తన శరీరంపై గాయాలను చూపించింది. వెంటనే సిబ్బంది డీసీపీఓకు సమాచారం అందించారు. సంబంధిత వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్లో కేసు పెట్టకపోగా విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే అందరి ఉద్యోగాలు పోతాయని సిబ్బందిని ఆ ముఖ్య అధికారి బెదిరించినట్టు తెలిసింది. బాలికను వలిగొండలోని ఓ ప్రయివేట్‌ అనాథాశ్రమానికి తరలించినట్టు సమాచారం. నిందితుడు జిల్లా లీగల్‌ సెర్వీసెస్‌కు చెందిన ఓ అటెండర్‌గా సమాచారం. కాగా ఆదివారం బాధితురాలు ఉన్న వలిగొండ శాంతి నిలయంలో సంబంధిత బాలసదన్‌ అధికారులు, కౌన్సిలర్‌ విచారణ జరపగా.. తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని చెప్పినట్టు తెలిసింది.
కేసు నమోదు
ఈనెల 20న బాలసదన్‌ సిబ్బంది ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే ఆదేశాల మేరకు సీడబ్య్లూసీ కమిటీ విచారణ చేయనున్నది. ఈ సంఘటనపై అల సత్వం వహించిన అధికారులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు.