
నవతెలంగాణ -తాడ్వాయి
విద్యార్థినిలు గొప్ప స్ఫూర్తితో విద్యను అభ్యసించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం మండలంలో 205.00 లక్షల రూపాయల సమగ్ర శిక్ష నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి గృహ భవనాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు విద్యకు దూరమవుతున్నారని ఉద్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విద్యాలయాల ద్వారా బాలికలకు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత వసతితో కూడిన విద్యను అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని గ్రావిణ ప్రాంతాలలో ఉండే బాలికలు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ క్రీడలు కూడా ఎంతో అవసరమని ప్రభుత్వం వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు కల్పిస్తూ ఉచితంగా ఏకరూప దుస్తులను , పాఠ్యపుస్తకాలను, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించాలని , ప్రతి విద్యార్థిని వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను ఆశయాలను నెరవేర్చే విధంగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి , డీఈవో పానిని, జి సి డి వో రమాదేవి, వివిధ శాఖల అధికారులు, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఎస్ఓ మరియు ఉపాధ్యాయ బృందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.