అమ్మాయిలూ ‘గేమ్‌’ఛేంజర్లే

Girls are 'game' changers‘గేమ్‌ అమ్మాయిలది కాదు, అబ్బాయిలదీ కాదు. స్టామి నాది…’ అని ఓ యాడ్‌లో అన్నట్టు సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ ఆటకు లింగభేదం లేదు. ఇదే మన క్రీడాకారిణిలు మరోసారి రుజువు చేశారు. తాజాగా తొలి మహిళల అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీలో మన అమ్మాయిలు అదరగొట్టి టైటిల్‌ సాధించారు. దేశం గర్వించేలా చేశారు. ఫైనల్లో 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించారు. ‘అమ్మాయిలు సత్తా చాటేనా’ అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ మన మహిళా క్రికెట్‌ టీమ్‌ రికార్డులు బద్దలు కొట్టింది. ఈ టీంలో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం మనకు మరింత గర్వకారణం.
ఒక్క క్రికెట్‌లోనే కాదు అన్ని రకాల క్రీడల్లోనూ మన అమ్మాయిలు ఎప్పటికప్పుడు ఇండియా పరువు నిల బెడుతూనే ఉన్నారు. అంతర్జాతీయ పోటీల్లో దేశం పెట్టు కుంటున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు మోస్తూనే ఉన్నారు. క్రికెట్‌, దానికి మించి రెజ్లింగ్‌, హాకీ, ఫుట్‌బాల్‌తో, బాక్సింగ్‌తో పాటు షూటింగ్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, జిమ్నాస్టిక్స్‌, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌… ఇలా ఏ విభాగంలో చూసినా ప్రస్తుతం పురుషులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మంది క్రీడాకారిణులు ఉన్నారు. గతంలో జరిగిన రియో ఒలింపిక్స్‌లో, టోక్యో ఒలింపిక్స్‌తో పాటు అనేక పోటీల్లో తమ శక్తిమేరకు మెరుగైన ప్రతిభ కనబరిచారు.
ఇలా ఎన్ని పతకాలు సాధించినా మన పురుషాధిక్య సమాజంలో క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలంటే అమ్మాయి లకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. సంస్కృతి, సాంప్రదాయం పేరిట అవరోధాలు సృష్టిస్తూనే ఉన్నారు. దేశానికి పతకాల వర్షం కురిపిస్తున్న రెజ్లర్‌లపై లైంగిక దాడులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ వంటి నేరస్తులను కాపాడుకునేందుకు తీవ్రంగా కృషి చేసిన చరిత్ర మన కాషాయ పాలకుది. ఇలాంటి ఎన్నో అడ్డంకులను ఎదిరించి అమ్మాయిలు కొందరు క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టినా, సరైన సదుపాయాలు ఉండటం లేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయినా పురుషుల కంటే తామేమీ తక్కువ కాదంటున్నారు మన క్రీడా కారిణులు. రెండు దశాబ్దాల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.
ఇరవైయేండ్ల కిందట సిడ్నీ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌కు భారత్‌ 72 మంది క్రీడాకారులను పంపింది. అప్పుడే కరణం మల్లేశ్వరికి వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం వచ్చింది. ఆ ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించింది ఆ ఒక్క పతకమే. ఇక రియో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌కు 15 విభాగాలకు చెందిన 117 మంది క్రీడాకారులు వెళ్లారు. అందులో 54 మంది మహిళలు ఉన్నారు. అప్పుడు కూడా రెండు పతకాలు మాత్రమే వచ్చాయి. అవీ మహిళలు సాధించినవే. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్‌ కాంస్యం. అప్పటి నుండి నేటి ‘ఖేలో ఇండియా’ వరకు మహిళలు వివిధ క్రీడల్లో, అనేక విభాగాల్లో పతకాలు సాధిస్తూనే ఉన్నారు. ఇక నిరు పేద కుటుంబంలో పుట్టిన మేరికోమ్‌ పక్కింటి వారు పెట్టిన మాంసం తిని బాక్సింగ్‌లో రాణించి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది.
లింగ సమానత్వం అత్యంత తక్కువగా ఉన్న హర్యానా లాంటి రాష్ట్రాల నుండి కూడా కొందరు ప్రముఖ మహిళా క్రీడాకారిణులు దేశానికి వన్నె తెస్తున్నారు. వారిలో గీతా ఫోగట్‌, బబితా ఫోగట్‌, వినేష్‌లు రెజ్లింగ్‌లో అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఇటీవల ముంబయి, హైదరాబాద్‌ వంటి నగరాల నుంచి అనేక మంది మహిళా క్రీడాకారిణులు వెలుగులోకి వచ్చారు. పాఠశాల, జిల్లా స్థాయిలో పోటీలకు దిగుతున్నారు. అవకాశం వస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంటున్నారు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఆర్థిక భారం అమ్మాయిలను వెంటాడుతోంది. క్రీడా రంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్‌ కూడా నామమాత్రంగానే ఉంటోంది. ప్రభుత్వాలు కూడా పతకాలు సాధించిన క్రీడాకారులకే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. నైపుణ్యం ఉన్న వారిని ముందే గుర్తించి, తగిన శిక్షణ ఇవ్వడంలో మన ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవు తున్నాయనేది అందరూ అంగీకరించే వాస్తవం. దీని వల్ల పేద, గ్రామీణ క్రీడాకారిణులు నైపుణ్యం ఉన్నప్పటికీ కింది స్థాయిలోనే ఆగిపోతున్నారు.
ఇక పూర్తిగా భద్రత కరువైన నేటి సమాజంలో ఆడపిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. క్రీడల్లో అమ్మాయిల వెనకబాటుకు ఇది కూడా ఓ కారణం. అలాగే మెరుగైన శిక్షణ, పోషకాహారం వంటి కారణాలతో ఇప్పటికీ దేశంలో క్రీడలు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. కొన్ని చిన్న గ్రామాల్లో అయితే ఆటలపై అవగాహన ఉండడం లేదు. ఇక పోటీల గురించి ఎలా తెలుస్తుంది? కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల స్థాయి నుండే అమ్మాయిలను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత తమదే అని ప్రభుత్వాలు గుర్తించాలి. ముఖ్యంగా గ్రామ స్థాయిలో క్రీడలకు మౌలిక సదుపాయాలు మెరుగుపడితే క్రీడాకారిణులు మరింత మంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.