– సెమీస్‌లో జపాన్‌పై 2-0తో గెలుపు
– నేడు చైనాతో భారత్ టైటిల్ పోరు
– మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ
పట్నా (బిహార్): డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఇండియా దుమ్మురేపింది. మహిళల 2024 ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో అజేయ జైత్రయాత్ర కొనసాగించింది. మంగళవారం బిహార్‌లోని రాజ్‌గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సెమీఫైనల్లో జపాన్‌పై భారత్ 2-0తో సూపర్ విక్టరీ సాధించింది. ఆటలో తొలి మూడు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆఖరు 15 నిమిషాల ఆటలో రెండు సార్లు జపాన్ గోల్‌పోస్ట్‌ను ఛేదించిన టీమ్ ఇండియా అమ్మాయిలు.. 2-0తో విజయాన్ని అందించారు. మరో సెమీఫైనల్లో చైనా 3-1తో మలేషియాపై గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో చైనా, భారత్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లో చైనాపై భారత్ 2-0తో మెరుపు విజయం సాధించింది. హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చైనా ఆరో స్థానంలో ఉండగా, భారత్ 9వ స్థానంలో కొనసాగుతుంది. నేడు టైటిల్ పోరులో ఆతిథ్య టీమ్ ఇండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
ఆఖర్లో మెరుపుల్: సెమీఫైనల్లో భారత్ ఆశించిన ప్రదర్శన చేయలేదు. జపాన్‌పై తొలి 45 నిమిషాల ఆటలో ఒక్క గోల్ చేయలేదు. పెనాల్టీ అవకాశాలను గోల్స్ మలచటంలో విఫలమైంది. ఆఖరు 15 నిమిషాల ఆటలో ఒత్తిడిని అధిగమించిన నవనీత్ కౌర్ భారత్‌కు తొలి గోల్ అందించింది. 48వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. 56వ నిమిషంలో లాల్‌రెమిసియామి ఫీల్డ్ గోల్‌తో అదరగొట్టింది. దీంతో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. గోల్స్ వేటలో సునెలిత, ప్రీతి దూబెలకు గ్రీన్ కార్డ్ ఎదురైనా.. భారత్ దూకుడు తగ్గలేదు. నేడు ఫైనల్లో దీపిక సెహ్రావత్, సంగీత కుమారి, ప్రీతి దూబె, నవనీత్ కౌర్, లాల్‌రెమిసియామిలపై భారీ అంచనాలు ఉన్నాయి.