తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. అనేక సభల్లో, వేదికలపై వృత్తిదారుల సంక్షేమానికి పాటు పడుతున్నామని చెబుతున్న పాలకులు ప్రత్యేక రాష్ట్రంలో గీతన్నలకు ఇచ్చే గుర్తింపు ఇదేనా? గీత వృత్తిపై ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోతున్నారు. కాళ్లు చేతులు విరుగుతున్నాయి. నడుములు పడిపోయి మంచాన పడుతున్నారు. రెండు రోజులకు ఒకరు చొప్పున చనిపోతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సంవత్సరానికి సుమారు 550మంది చెట్టుపై నుంచి జారి పడుతున్నారు. 180మంది తనువు చాలిస్తున్నారు. ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు. వీరిని ఈ ప్రమాదాల నుండి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా… లేదా? మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ అధ్యక్షులు, మంత్రివర్యులు కేటీఆర్ ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకుంటామని, గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలిస్తామని, లిక్కర్ షాపులలో గౌడలకు ఇచ్చే 15శాతం రిజర్వేషన్‌లు సొసైటీలకు ఇస్తామని, గీతన్న బీమా పథకం తదితర గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవి ఇంతవరకు నెరవేర్చలేదు. ఇటీవల జరిగిన లిక్కర్ షాప్ టెండర్లలో సొసైటీలకు రిజర్వేషన్స్ కల్పించకుండా పాత పద్ధతినే కొనసాగించారు. మోపెడ్‌లు ఇస్తారని గత రెండేండ్లుగా ఆశతో ఎదురుచూస్తున్న కల్లు గీత కార్మికులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయించామని చెప్పారు. బడ్జెట్ పత్రంలో మాత్రం రూ.30కోట్లు కుదించారు. ఆరు నెలలవుతున్నా ఇప్పటికి వాటిలో ఒక్క రూపాయికి కూడా ఖర్చు చేయలేదు. కల్లు గీత కార్పొరేషన్ పేరుకు మాత్రమే ఉన్నది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల తర్వాత కార్పొరేషన్‌కు చైర్మెన్‌ను నియమించింది. దీని వలన వారి రాజకీయ ప్రయోజనం నెరవేరింది తప్ప గీత కార్మికులకు అదనపు ప్రయోజనం ఒనకూరింది ఏమీలేదు. కార్పొరేషన్‌కు తగిన బడ్జెట్ కేటాయించకుండా, వృత్తిలో ఆధునిక పద్ధతులు అవలంబించకుండా ఏమి చెప్పినా ఒట్టి మాటలుగానే మిగిలిపోతాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన గీతన్న బీమా అమలు కావడం లేదు. ఇటీవల బీసీ కుల వృత్తి దారులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహకారమందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన రాగానే గీత కార్మికులు అనందపడ్డారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ జీఓ విడుదల చేయడంతో అర్హులైనవారు 13వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గడువు సమయం కొద్ది రోజులే ఉండటం వలన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలందక పోవడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారు. వీరిలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ పథకం అమలు కాలేదు. గీత కార్మికులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఏ పథకం ఇప్పటి వరకు రాలేదు. మిగతా తోటి కుల వృత్తుల వారికి ఎంతో కొంత మేరకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వారికి అమలవడం మంచిదే. కానీ వీరికి కూడా పథకాలు వర్తిస్తే ఇంత నిరాశకు గురయ్యేవారు కాదు. మరోపక్క గౌడ సామాజిక వర్గానికి చట్ట సభలలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారని ఆవేదన. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం నేటికి అమలు కావడం లేదు. కొద్ది మంది ధనవంతుల చేతుల్లో సంపద కేంద్రీకృతమవుతుంది. వృత్తిదారులంటే సామాజికంగా చిన్నచూపు ఉంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సీట్ల కేటాయింపులో డబ్బులున్నోళ్లు, అగ్ర కులాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి సమస్య రాజకీయాలతో ముడిపడి ఉన్నందున చట్ట సభల్లోనూ వీరి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. వృత్తిలో ఉపాధి పెరగాలంటే సొసైటీలకు చెట్ల పెంపకానికి భూమినివ్వాలి, కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి. అందుకు రూ.5వేల కోట్ల బడ్జెట్ అవసరం. దాన్ని ఆచరణకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలి. అప్పుడే గీత వృత్తిదారులకు తగిన భరోసా కలుగుతుంది. ఇప్పటికే ఈ అంశాలపై అనేకసార్లు తెలంగాణ కల్లుగీత కార్మికసంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇచ్చి, ఉద్యమాలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల నేపథ్యంలోనైనా గీతన్నల సమస్యలు పరిష్కరించాలి. అందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 22న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ధర్నాకు అన్ని జిల్లాల నుంచి గీతకార్మికులు హాజరై విజయవంతం చేయాలి.
– ఎం.వి.రమణ, సెల్: 9490098485.