40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వండి

40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వండి– పీఆర్సీ కమిషన్‌కు టీజీవో ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల (టీజీవో) కేంద్ర సంఘం కోరింది. 40 శాతం ఫిట్‌మెంట్‌ను గతేడాది జులై ఒకటి నుంచి ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు పీఆర్సీ కమిటీ చైర్మెన్‌ శివశంకర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి ప్రతిపాదనలను సమర్పించారు. గరిష్ట వేతనం రూ.2,95,460 నిర్ణయించాలని సూచించారు. హెచ్‌ఆర్‌ఏ జీహెచ్‌ఎంసీలో 28 శాతం, జిల్లా కేంద్రాల్లో 20 శాతం, మండలాలు, మున్సిపాల్టీల్లో 17 శాతం, ఇతర ప్రాంతాల్లో 15 శాతం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవో అసోసియేట్‌ అధ్యక్షులు బి శ్యామ్‌, ఉపాధ్యక్షులు ఎ జగన్‌మోహన్‌రావు, కోశాధికారి ఎం ఉపేందర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రెటరీ ఎ పరమేశ్వర్‌రెడ్డి, మహిళా ప్రతినిధి జి దీపారెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఎం రామకృష్ణగౌడ్‌, కార్యనిర్వాహక సభ్యులు పి యాదగిరి, సలహాదారులు టి రవీందర్‌రావు, జి పురుషోత్తంరెడ్డి, వి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.