ధరణిపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి

In 10 days on Dharani Give a comprehensive report– భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ
–  వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విస్తీర్ణమెంత?
–  కేంద్రం ఇచ్చిన రూ.83 కోట్ల నిధులు ఏమయ్యాయి?
–  అన్ని వివరాలు నివేదికలో పొందుపర్చండి : సీఎస్‌ను ఆదేశించిన సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారం కోసం మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై బుధవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహా, సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. మంత్రులతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు కమిటీలో సభ్యులుగా ఉండాలన్నారు. ధరణి యాప్‌ భద్రతపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ధరణిపై తీసుకున్న నిర్ణయాలపై పూర్తి నివేదిక అందజేయాలని సీఎస్‌ శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. ఈ పోర్టల్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. నిషేధిత భూములు, అసైన్డ్‌ భూములు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విస్తీర్ణమెంత? పూర్తి వివరాలను నివేదికలో పొందు పర్చాలన్నారు. గతంలోని భూ సమగ్ర సర్వేపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సదస్సులు, రికారుల్డ సవరణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. భూముల సర్వే, డిజిటలైజేషన్‌, టైటిల్‌ గ్యారంటీ, చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.83 కోట్ల నిధులు ఎమయ్యాయని అధికారులను సీఎం ప్రశ్నించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీపై కూడా సీఎం ఈ సందర్భంగా చర్చించారు. గత ప్రభుత్వం భూముల డిజిటలైజేషన్‌ కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సమస్యల నిలయంగా మారిందని, ప్రజలు ఈ పోర్టల్‌ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన ముఖ్యమంత్రి, అధికారంలోకి రాగానే దాన్ని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే ధరణి పోర్టల్‌పై సంబంధిత అదికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణిని రద్దు చేసి కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు భూమాత పోర్టల్‌ను తీసుకురావడంలో భాగంగానే బుధవారం సీఎం సమీక్ష నిర్వహించి కమిటీ ప్రతిపాదన చేసినట్టు సమాచారం.