– ప్రజాభవన్‌లో డీఎస్సీ-2008 అభ్యర్థుల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నియామకపత్రాలను వెంటనే ఇవ్వాలని డీఎస్సీ-2008 అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 200 మందికిపైగా అభ్యర్థులు వచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయి 50 రోజులు గడిచినా ఇంకా నియామక పత్రాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,400 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనట్టు సమాచారం ఉందని వివరించారు. వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇచ్చి, నియామకపత్రాలను ఇస్తారని ఆశించామని అన్నారు. కానీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని చెప్పారు. ప్రజాభవన్‌లో డీఎస్సీ-2008 అభ్యర్థులతో ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్ జి చిన్నారెడ్డి చర్చలు జరిపారు. అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించారు. వెంటనే విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి, ఇతర అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉన్నదని వారు వివరించినట్టు తెలిసింది. అధికారులతో తాను మరోసారి మాట్లాడతాననీ, రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని అభ్యర్థులకు చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ-2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, కార్యదర్శి మెరుగు భాస్కర్, ప్రమీల, మహేశ్వరి, పరమేశ్వరి, జ్యోతిర్మయి, భూపతిరెడ్డి, కర్ణ ప్రసాద్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.