బెయిల్‌ ఇవ్వండి

– ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు తిరుపతన్న
– రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషనల్‌ ఎస్పీ మేకల తిరుపతన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఈనెల 20న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తిరుపతన్న తరపు న్యాయవాది పి. మోహిత్‌ రావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లు విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరపున మోహిత్‌ రావు వాదనలు వినిపిస్తూ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబి అదనపు ఎస్పీ తిరుపతన్న, భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావులు ఈ ఏడాది మార్చి 23న అరెస్టయ్యారని కోర్టుకు నివేదించారు. అనంతరం కోర్టు వీరికి రిమాండ్‌ విధించింది. అప్పటి నుంచి దాదాపు 211 రోజులుగా తిరుపత్న జైలులోనే ఉన్నారని మోహిత్‌రావు తెలిపారు. ఆయన దాదాపు తొమ్మిది లక్షల పేజీల చార్జిషీట్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌)ను దాఖలు చేశారని, ఇది దాఖలు చేసి కూడా మూడు నెలలు కావొస్తుందని వివరించారు. చట్ట ప్రకారం ట్రయల్‌ కోర్టు, రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించగా, బెయిలు పిటిషన్లను కొట్టివేసిందని తెలిపారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న ధర్మాసనం 211 రోజులుగా తిరుపతన్న జైలులో ఎందుకు ఉన్నారని, ఆయన చేసిన నేరం ఏంటని తిరుపతన్న తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు మోహిత్‌ రావు సమాధానం ఇస్తూ ”ఎస్‌ఐబి వింగ్‌ అనేది నా కంట్రోల్‌లో నడుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం, ప్రొఫైల్‌ తయారు చేయడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం అధికారిగా తన పని’ అని తిరుపతన్న గురంచి ధర్మాసనానికి తెలిపారు. ఈ వాదనలపై మరోసారి కోర్టు జోక్యం చేసుకొని, ”మాకు దీనిలో ఆఫెన్స్‌(నేరం) ఏంటీ అనేది అర్థం కావడం లేదు’ అని అభిప్రాయపడింది. అయితే ప్రభుత్వ వాదనలు సైతం వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ తరపు స్టాండింగ్‌ కౌన్సిల్‌కు పిటిషన్‌ కాపీని అందజేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ, తదుపరి విచారణను నవంబర్‌ 27కు వాయిదా వేసింది.