ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వండి

delhi high court– ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశం
– విచారణకు రావాలని జర్నలిస్టులకు మళ్లీ సమన్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉపాచట్టం కింద అరెస్టయిన న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్టాక్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అమిత్‌ చక్రవర్తికి ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ దశలో ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వలేమన్న ఢిల్లీ పోలీసుల వాదనను అదనపు సెషన్స్‌ జడ్జి హర్దీప్‌ కౌర్‌ తోసిపుచ్చారు. అదే సమయంలో ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే చర్యలో భాగంగా ఢిల్లీ పోలీసులు సీనియర్‌ జర్నలిస్టులైన పరంజోరు గుహా ఠాకుర్తా, అభిసార్‌ శర్మలను విచారణకు హాజరుకావాలని మళ్లీ సమన్లు పంపారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందజేయడాన్ని వీలైనంత వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నం కోర్టు జోక్యంతో విఫలమైంది. కాపీని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు విచారించింది. ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ.. ఈ దశలో కాపీని ఇవ్వ లేమని వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, నిందితులు మొదట కాపీ కోసం కమిషనర్‌ను సంప్రదించాలని, ఆ తరువాత డిమాండ్‌ను పరిశీలించేందుకు కమిటీ వేయాలని అన్నారు. ప్రస్తుత దశలో అటు వంటి అభ్యర్ధనను కోర్టు స్వీకరించొద్దని, అరెస్టుకు దారితీసిన పరిస్థి తులు, ఇతరుల ను రిమాండ్‌ దరఖాస్తులో పేర్కొనడం జరిగిందని అన్నారు. నిందితులను వివరించామని శ్రీవాస్తవ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని పొందేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని ప్రబీర్‌ తరపు న్యాయవాది అర్ష్‌దీప్‌ సింగ్‌ ఖురానా అన్నారు. అంతేకాదు, అరెస్టుకు గల కారణాలను కూడా లిఖితపూర్వకంగా అందజేయాలని న్యాయవాది పోలీసులను కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కాపీని అందజేయాలని ఆదేశించింది. ప్రబీర్‌, అమిత్‌ ప్రస్తుతం వారం రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
సీనియర్‌ జర్నలిస్టులకు సమన్లు
సీనియర్‌ జర్నలిస్టులు పరంజోరు గుహా ఠాకుర్తా, అభిసార్‌ శర్మలకు మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు గురువారం సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు మంగళవారం 46 మందిని ప్రశ్నించారు. ప్రశ్నలను ఏ, బీ, సీ అనే మూడు జాబితాలుగా విభజించారు. అరెస్టు చేయవలసిన వారిని జాబితా ఏ చేర్చింది. ప్రబీర్‌, అమిత్‌లతో పాటు ఈ జాబితాలో మరో నలుగురు ఉన్నారని కొన్ని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఠాకుర్తా, అభిసార్‌లను అరెస్టు చేయడానికి మళ్లీ పిలుస్తున్నట్టు చర్చ జరుగుతుంది.