నివసించడానికి కొత్తవారొస్తే సమాచారం ఇవ్వండి

– ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి
– నిత్యావసర సరుకుల పంపిణీ
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల పరిధిలోని గొత్తికోయ గుంపులకు నివసించడానికి కొత్తవారొస్తే, అపరిచితులు సంచరించినా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి ప్రజలకు సూచించారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని రాయిపాడు గ్రామం గొత్తికోయ గుంపు వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు, మంచి నూనె, కారం, పసుపు, ఉప్పు, తదితర వంట సరుకులను డీఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఆళ్ళపల్లి మండల చరిత్రలో తొలిసారిగా కిన్నెరసాని నది ఉగ్రరూపం దాల్చడం, దాంతో పరివాహక ప్రాంతాలైన రాయిపాడు, ముత్తాపురం, పాక్షికంగా అనంతోగు గ్రామాల్లో పలువురు గిరిజనుల ఇండ్లలోకి భారీగా వరదనీరు చేరడం, దాని కారణంగా అత్యధికంగా రాయిపాడు గ్రామంలోని నిరుపేద గొత్తికోయ గుంపు ప్రజల ఇండ్లు ఎక్కువగా కూలిపోవడం చాలా బాధాకరమైన, భయంకరమైన ప్రకృతి వైపరిత్యంగా చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడిప్పుడే ఆర్ధిక, విజ్ఞానం పరంగా పురోగతి సాధిస్తున్న గొత్తికోయ ప్రజల ఆర్ధిక ఎదుగుదలను గత అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు. వరద ముంపునకు గురై తీవ్రంగా ఆస్తి, ఆర్ధికంగా నష్టపోయిన గొత్తికోయ ప్రజలకు పోలీస్ శాఖ తరుపున ఎంతోకొంత సహాయం చేయాలనే దృక్పథంతో నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందని చెప్పారు. గుంపులోకి కొత్తగా వచ్చిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి, ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్, కానిస్టేబుల్ కె.ఉపేందర్, తదితర సిబ్బంది ఉన్నారు.