ఏ దేశంలోనైనా పాలకుల పాలనా విధానాలను బట్టే ప్రజల అభివృద్ధి లేదా పేదరికం ఆధారపడి ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్య్ర అనంతరం అభివృద్ధి చెందినప్పటికీ ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అభివృద్ధి ఫలాలు కొందరికేనా! అప్పుల భారం అందరి పైనా.. అనే చర్చ జరుగుతుంది. అప్పుచేసి పప్పుకూడు తగదంటారు. ”అప్పు ముప్పు” ఎందుకంటే? అప్పు అసలు తీర్చడం కన్నా దాని వడ్డీలు చెల్లించ డానికి ఉన్న ఆస్తులు అమ్మాల్సిందే అంటారు పెద్దలు. నేడు మన దేశంలో అప్పులు చేసి బ్యాంకులను, ఆర్థిక రంగాన్ని దివాలా తీయించి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి పరాయి దేశాల్లో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఆ భారాన్నంతా దేశ ప్రజలు భరించాల్సి వస్తుంది. ఈ అప్పులను రాబట్టాల్సిన విషయంలో పాలకులు కూడబలుక్కొని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కానీ జీవనోపాధి కోసం పేదవాడు అప్పు చేస్తే రాచి రంపాన పెట్టి పరువును బజారు కీడుస్తూ, దండోరా వేసి అప్పుల వసూళ్ల కోసం వారి ఆస్తులను వేలం వేస్తూ, జప్తు చేస్తారు. ఈ అమానుష చర్యలు తట్టుకోలేక సామాన్యులు ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. ఉన్నోడికి ఒక నీతి, పేదోడికి ఒక నీతి అన్నట్లు వివక్ష కొనసాగుతుంది నిజం కాదా!.
ప్రపంచంలోనే నేడు మన దేశం అభివృద్ధి పథంలో శరవేగంతో దూసుకుపోతుందని పాలకుల ఉపన్యాసాల మోత, ప్రకటనల జోరుతో హోరెత్తిస్తున్నారు. గత ఐదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రచార ప్రకటనల కోసం రూ.3,064.42 కోట్లు ఖర్చు చేసింది. అందులో ఫ్రింట్ మీడియాకు రూ.1,338.56 కోట్లు కాగా, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.1,273.06కోట్లు ఖర్చు పెట్టారు. హోర్డింగులు వంటి అవుట్ డోర్ ప్రకటనలకు రూ.452.8 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. ప్రధాని విదేశీ పర్యటన కోసం రూ.254.87కోట్లు ఖర్చు చేశారు. ఇలా ప్రభుత్వ పథకాల ప్రచారర్భాటానికి ప్రపంచంలో కీర్తి ప్రతిష్టల కోసం వెంప ర్లాడుతూ ప్రజాధనాన్ని ఆర్థిక క్రమశిక్షణ లేమితో ఖర్చు చేస్తున్నారు. పాలకులు చెప్పే ఈ అభివృద్ధి ఫలాలు ఏ వర్గాలకు చేరినాయి? పాలకుల సన్నిహితులకు, వ్యాపార, కార్పొరేట్ రంగా(వర్గా)లకు చేరినట్లు ఆర్థిక గణాంకాలే తెలుపుతున్నాయి. వీరి ఆస్తులు ఎంతగా పెరిగిపో యాయంటే 2020 సంవత్సరం లెక్కల మేరకు ముఖేష్ అంబానీ ఆస్తులు 350శాతం, గౌతం ఆదాని ఆస్తులు ఏకంగా 700శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మూడేండ్లలో మరింత పెరిగాయి. కరోనా పేదలను దరిద్రులను చేసింది. కానీ కార్పొరేటు దిగ్గజాల వృద్ధిని అడ్డుకోలేకపోయింది. ప్రస్తుతం దేశం, రాష్ట్రాల అప్పుల కుప్పలు కొండల్లా పెరిగిపోతున్నాయి. గత దశాబ్ద కాలంలో క్రమేపి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు 200శాతం పెరగగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు 150శాతం పెరిగింది. ఈ వివరాలు సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. కేంద్రం అప్పుల భారం 2022-23కి గాను రూ.155.6 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రాలు మొత్తం రూ.76.1లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు రూ.220.5లక్షల కోట్లకు చేరినాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అంటే ప్రతి భారతీయుడుపై సుమారు రూ.1,50,000 పైగా అప్పుల భారం పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వివిధ బ్యాంకుల నుండి ప్రజలు తీసుకున్న వ్యక్తిగత అప్పులు రూ.41లక్షల కోట్లకు చేరినాయి.
2014తో పోలిస్తే ఈ అప్పులు 400శాతం పెరిగాయి. ఉపాధిలేమితో కుటుంబాల ఆదాయాలు పరిమితంగా ఉంటున్నాయి. కొద్దిమందికైతే తగ్గిపోయాయి. ఈ దేశం ప్రగతి సంగతేమో కానీ అప్పుల కుప్పలు పెరిగి పోయాయి. దొరికినకాడల్లా అప్పులు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని ప్రపంచ బ్యాంకు వరకు అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇలా రాష్ట్రాలు, ప్రజలు వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగు తున్నారు. దీనికి ఆర్థిక క్రమశిక్షణ లేని విధానాలే కారణం. ఇది పూడ్చుకోవడానికి ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను హోల్‌సేల్‌గా అమ్మేస్తు న్నారు. అయినా సరిపోకపోవడంతో ప్రజలనెత్తిన భరించలేని ఆర్థిక భారాలు జీఎస్టీ, పన్నులు, సెస్సుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇంత చేసినప్పటికీ కేంద్ర ఖజానా నిండటం లేదు. ఈ అప్పులను ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తే మంచిదేనని సమర్థించవచ్చు. కానీ వీటిని కార్పొరేట్ రంగానికి వారి అనుయాయులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహాకాలు, సబ్సిడీలు, రాయితీల వంటి తాయిలాలు ఇస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం తెచ్చిన రుణాలకు వడ్డీలకే సరిపోతుంది. 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం వడ్డీ చెల్లింపులకు సుమారు రూ.11లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది సంవత్సరానికి చేసే మొత్తం వ్యయంలో 23శాతం. అంటే ప్రజల సొమ్ములో అధిక భాగం ప్రభుత్వాలు తీసుకున్న రుణాల వడ్డీ చెల్లింపులకే వినియోగిస్తున్నారు. ఇలా అప్పులు వాటికి వడ్డీలు ఏండ్ల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత రాబోయే ప్రభుత్వాలకు తలనొప్పిగా మారబోతుంది. ఇలాంటి ఆర్థిక క్రమశిక్షణ లేని విధానాలతో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఉపాధి లేమి, పేదరికం పెరిగిపోతుంది. ఆర్థిక అసమానతల అగాధం రెట్టింపు అవుతుంది. ఇప్పటికైనా పాలకులు భావోద్వేగాలు రెచ్చగొట్టే, విభజించే విధానాలు మాని అప్పుల ఊబి నుంచి ఈ దేశాన్ని బయటపడే ప్రయత్నాలు చేయాలి.
మేకిరి దామోదర్
9573666650