ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పించండి : కొండమడుగు నర్సింహ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి

నవతెలంగాణ- వలిగొండ రూరల్: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వారికి అవకాశం కల్పించాలని భువనగిరి నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నర్సింహ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాల నుండి  వివిధ వృత్తి దారుల సమస్యలపై,ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్,  కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేవలం డబ్బులు వెదజల్లి గెలిచి మరిన్ని డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారని  విపరీతమైన డబ్బుల్ని ఖర్చు చేస్తూ, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మూడు పార్టీల అభ్యర్థులు  గెలిచిన ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండరని అన్నారు. ఈ ఎన్నికల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సీపీఐ(ఎం) అభ్యర్థి తనకి అవకాశం కల్పించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కమిటీ సభ్యుడు కొండే కిష్టయ్య,  శాఖ కార్యదర్శి గూడూర్ వెంకట నరసింహారెడ్డి, మంగ బాలయ్య, పోలేపల్లి ఉప్పలయ్య, కాటేపల్లి వెంకటేశం, పోలేపల్లి పెద్ద స్వామి, పోలేపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.