పెండింగ్‌ బిల్లులు ఇవ్వండి

Give pending bills– గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచుల నిరసన
– అసెంబ్లీ ముందున్న రహదారిపై బైటాయించే యత్నం
– అడ్డుకున్న పోలీసులు, మాజీ సర్పంచుల అరెస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామపంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద మాజీ సర్పంచులు నిరసనకు దిగారు. ‘నూతన గ్రామపంచాయతీ భవనాలు నిర్మించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలి…అప్పులు చేసి అభివృద్ధి చేశాం..మేం రోడ్లమీద పడ్డాం..సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌, డ్రెయినేజీ బిల్లులను వెంటనే ఇవ్వాలి’ అంటూ నినాదాలు చేశారు. కాసేపు అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత గన్‌పార్కు నుంచి అసెంబ్లీ గేటువైపు ఉన్న ప్రధాన ద్వారంపైకి నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. అక్కడే బైటాయించేందుకు యత్నించారు.
వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు మాజీ సర్పంచులను అరెస్టు చేశారు. అంతకు ముందు నిరసన సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్‌, ప్రధాన కార్యదర్శి కొలను శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..సర్పంచుల పదవీకాలం అయిపోయినగానీ చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడం సరిగాదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా వాటిని ఇప్పించాలని కోరారు. పాదయాత్ర లు, ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం రాగానే సర్పంచులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క హామీనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఇప్పటికే పలుమార్లు విన్నవించామని తెలిపారు. అప్పులు చేసి చేపట్టిన అభివృద్ధి పనులకు రెండు,మూడేండ్ల నుంచి బిల్లులు రాకపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోతున్నా యనీ, అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతు న్నారని వాపోయారు. ఒక్కో మాజీ సర్పంచికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా బిల్లులు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో వెంటనే పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని కోరారు.
అప్పు ఎట్ట తీర్చాల్నో
ముస్కు మల్లయ్య, కృష్టరావు పల్లె, ఇల్లంతకుంట మండలం
సర్పంచిని ఇనామస్‌గా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీ అభివృద్ధికి 25 లక్షలిస్తమని కేటీఆర్‌ సార్‌ పేపర్‌కు ఇచ్చిండు. ఇప్పటిదాకా ఇయ్యలేదు. గెలిచిన పొద్దుల నుంచి గ్రామపంచాయతీల పనులు జేసినం. 320 ఓట్లున్న మా చిన్న ఊరికి సర్పంచినైన నాకే 40 లక్షల రూపాయల పెండింగ్‌ బిల్లు రావాలే. కొత్తగా పంచాయతీ అయిందనే సంబురంలో ఊర్ల నన్ను ఇనామస్‌గా సర్పంచిని చేశారు. ఇంట్లకెళ్లి పైసలు పెట్టి 13 లక్షలతోని పట్టా జాగ కొనుక్కుని పంచాయతీ కార్యాలయం కట్టిన. రోడ్లేపిచ్చి..నల్లాలు పెట్టించి..పైపులైన్లు వేయించేసరికి దమ్ముకొచ్చింది. ఆ పైస లేదు..ఈ పైస లేదు..నా చిన్న గ్రామ పంచాయతీకి 40 లక్షలు రావాలే. ఓన్లీ గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టించేందుకే 16 లక్షల 60 వేలు పెట్టిన. శ్మశాన వాటిక కట్టి రెండేండ్లు అయి పోవస్తున్నది. ఇంకా మొత్తం బిల్లు రాలేదు. రెండు లక్షల 60 వేల రూపాయలు రావాలి. సర్పంచిగ గెలిచిన తెల్లారే సంబురం మీద ఆరు లక్షల 20 వేల రూపాయలు పెట్టి ఊర్ల బతుకమ్మ తెప్ప కట్టిన. ఇప్పటిదాకా దానికి రూపాయి లేదు రూపకం లేదు.
అప్పులిచ్చినోళ్లు ఇంటికి నడుస్తుండ్రు
వేముల దామోదర్‌, కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కాసారం
18 లక్షల పెండింగ్‌ బిల్లులు రావాలి. సీసీ రోడ్లు వేసి సంవత్సరం పొద్దు అవుతున్నది. పది లక్షలు బిల్లు రావాలే. 20 లక్షల అప్పుతెచ్చిన. వాళ్లను తప్పించుకుంట తిరుగుడైతాంది. దుకాణ్నాలల్ల బాకే. ఎలక్ట్రిక్‌ షాపుల బాకే. బ్లీచింగ్‌ పౌడరోనికి బాకే. ఎలక్ట్రిక్‌ షాపులనే నాలుగు లక్షల రూపాయలకు పైగ ఉంది. అప్పులిచ్చినోళ్లు ఇంటికి నడుస్తుండ్రు. గిట్లుంటే ఇంట్ల గొడవ కాకుండ ఉంటదా? భార్య తిట్టదా? సర్పంచితనం నిన్ను ఎవడుజేయమన్నడు? సర్పంచితనం జేస్తివి. ఉన్నదంత ఊడ్సితివి అని ఇంట్ల తిడుతుండ్రు. ఇంటోళ్లకు, బయటోళ్లకు సమాధానం చెప్పలేక చావుకొస్తాంది.
ఇగొస్తయోమో..అగొస్తయోమో అనుకుంటే రాకపాయే : లక్ష్మీ వీరన్న, తూర్పుతండ, మద్దిరాల మండలం సూర్యాపేట జిల్లా
27 లక్షల పెండింగ్‌ బిల్లులు రావాల. 20 లక్షల దాకా అప్పు చేసిన. పది లక్షల దాకా మిత్తీలయ్యాయి. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇగొస్తయేమో ఇగొస్తయేమో అని ఎదురుచూసినం. బిల్లులివ్వలేదు. కొత్తప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటినా మా గురించి పట్టించు కోవట్లేదు. అప్పులోళ్లు పైసలు అడుగుతున్నారు. ఏంజేయాల్నో అర్థమైతలేదు.
అవార్డుల కోసమని పనులు చేసుకుంటపోయినం..
ఇబ్బందిపడుతున్నం
కిరణ్మరు విజరు, మరిపెల్లి గూడెం, కమలాపూర్‌ మండలం, హన్మకొండ జిల్లా
మూడేండ్ల కింద ఇల్లు కుదవబెట్టి 30 లక్షలు అప్పుజేసిన. మా భార్య గోల్డ్‌ కుదవపెట్టి పదిలక్షలు తీసుకొచ్చిన. బయట మరో పది లక్షల అప్పుంది. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఫండ్‌ ఇగొస్తది..అగొస్తది..అని ఎదురుచూసుకుంట ఉన్నం. బిల్లులు ఇవ్వవే. స్టేట్‌ గవర్నమెంట్‌ ఇవ్వడం లేదని సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఆపింది. పనులు చేసుకుంట పోయినం. మా ఆవిడ పీజీ, నేను బీటెక్‌ చేసి ఇటువైపు ఎందుకొచ్చినమా? అనిపిస్తున్నది. అప్పులోళ్ల ఒత్తిళ్లు పెరిగిపోతున్నయి. ఊర్ల ఉండలేక హైదరాబాద్‌కొచ్చి బిల్డింగ్‌లకు లే అవుట్‌లు వేసుకుంట కాలం వెళ్లదీస్తున్న.