ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వండి

Give questioners a chance– ఆదరించి..గెలిపించండి : సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి మహమ్మద్‌ జహంగీర్‌
నవతెలంగాణ-చిట్యాలటౌన్‌
నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనకు.. చట్టసభల్లో ప్రజల పక్షాన పోరాడేందుకు అవకాశం ఇవ్వాలని.. ఓటేసి గెలిపించాలని సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి మహమ్మద్‌ జహంగీర్‌ అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి, వెలిమినేడు, నేరడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వెలిమినేడు గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేరడ గ్రామంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య అధ్యక్షతన జరిగిన సభలో జహంగీర్‌ మాట్లాడారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే సీపీఐ(ఎం)ను ఈ ఎన్నికల్లో ఆదరించాలన్నారు. సమస్త వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాంతంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. కల్లుగీత కార్మికుల కోసం ఏనాడూ పోరాటం చేయని బూర నర్సయ్యగౌడ్‌కు గీత కార్మికులను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీని ప్రజలు తిరస్కరించాలని కోరారు. డబ్బులు ఉన్నవాళ్లు పార్ట్‌టైం రాజకీయాలు చేస్తున్నారని, ఎన్నికల్లో పోటీకి వచ్చారని, ఎలాంటి వ్యాపారాలు లేని తాను పూర్తికాలం ప్రజల కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లు, ఎంపీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చట్టసభలలో ప్రశ్నించే వాడిని లేకుండా చేస్తున్నారని అన్నారు. రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న నరేంద్ర మోడీని ఓడించాలన్నారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై ప్రభు త్వాన్ని నిలదీయడం కోసం సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు అరుణజ్యోతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.