ఆశాలకు కనీస వేతనంగా రూ.18 వేలు ఇవ్వాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయించేలా దుబ్బాక ఎమ్మెల్యే కృషి చేయాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జీ.భాస్కర్ కోరారు.ఆశాలకు పీఎఫ్,ఈఎస్ఐ,ఉద్యోగ భద్రత,ప్రమోషన్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం దుబ్బాకలోని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పీఏ జనార్ధన్ కు వినతిపత్రాన్ని అందజేసి వారు మాట్లాడారు. గతంలోనే హైదరాబాద్ లోని హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందు వేలాదిమంది ఆశాలతో ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు.అప్పటి హెల్త్ కమిషనర్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశాలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, ప్రసూతి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని.. టార్గెట్లను రద్దు చేస్తామని పలు నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు.ఏడాది గడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ హామీలను అమలు చేయకపోగా ఆశాలతో సంబంధం లేని ఇతర పనులను చేయించడం బాధాకరమన్నారు.ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనియెడల సీఐటీయూ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమంలో ఆశా వర్కర్ల సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బీ.ప్రవీణ,సీఐటీయూ దుబ్బాక మున్సిపల్ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ఆశాలు చంద్రకళ, సంతోష, మాలతి, బాబాయి, కవిత, బాలమని, సుజాత, లక్ష్మి, భాగ్యమ్మ పలువురు పాల్గొన్నారు.