రైతుబంధు ఇచ్చేయండి సీఎం రేవంత్‌ ఆదేశాలు

Give Rythu Bandhu CM Revanth orders– రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ ప్రణాళిక
– ప్రజా దర్బార్‌.. ఇక నుంచి ప్రజావాణి
– వారానికి రెండు రోజులు నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను తక్షణమే (సోమవారం సాయంత్రం నుంచే) ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్‌ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే దానికి విధి విధానాలు, నియమ నిబంధనలు ఖరారు కాకపోవటంతో ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌ సర్కారు అమల్జేసిన రైతుబంధు కిందే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. సంబంధిత నిధులు ఇప్పటికే ట్రెజరీల్లో ఉన్నందున వెంటనే వాటిని రైతుల ఖాతాల్లో వేయాలని సూచించారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు నిర్వహించిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ… తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ బేగంపేటలోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ను ఇకనుండి ‘ప్రజావాణి’గా పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులపాటు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఉదయం 10 గంటలలోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి ప్రజావాణిలో అవకాశం కల్పించాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.