శ్రీలంకలో తమిళులకు గౌరవప్రదమైన జీవితం కల్పించండి

-: విక్రమసింఘేకు మోడీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ :శ్రీలంక 13వ సవరణను అమలు చేసి, రాష్ట్ర ఎన్నికలను నిర్వహించాలని ఆ దేశ అధ్యక్షులు రణిల్‌ విక్రమసింఘేకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. 13వ సవరణతో శ్రీలంకలో తమిళలకు గౌరవప్రదమైన జీవితం లభిస్తుందని మోడీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రణిల్‌ విక్రమసింఘే గురువారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్‌ స్వాగతం పలికారు. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌కి చేరుకున్న విక్రమ్‌సింఘేకు ప్రధాని నరేంద్రమోడీ సాదరంగా స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ‘ఈ ఏడాది రెండు దేశాలు దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. దీర్ఘకాలంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను సమీక్షించి, రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకోవడానికి ఈ సమావేశం దోహపడతుంది’ అని ట్వీట్‌ చేశారు. కాగా, 13వ సవరణ అనేది 30 ఏళ్ల క్రితం నాటి శ్రీలంక చట్టం, ఈ చట్టం అమలుతో 9 రాష్ట్రాలకు అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. ప్రధానమంత్రి మోడీని కలిసే ముందు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తోనూ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌తోనూ శ్రీలంక అధ్యక్షులు భేటీ అయ్యారు.
గౌతం అదానీ భేటీ
శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌ సింఘెతో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతం అదానీ భేటీ అయ్యారు. ”కొలంబో పోర్టు వెస్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌ అభివృద్థి, 500 మెగావాట్‌ విండ్‌ ప్రాజెక్ట్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌ గురించి చర్చించాం” అని అదానీ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోడీ మద్దతుతో శ్రీలంకలో విద్యుత్‌, పోర్టుల అభివృద్థి తదితర ప్రాజెక్టులను అదాని గ్రూపు చేపడుతోందనే విమర్శలు ఉన్నాయి.